Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఓటేయొద్దు ప్లీజ్.. సొంత అల్లుడి విజ్ఞప్తి.. వీడియో ఇదిగో!

Ambati Rambabu Son In Law Sensational Allegations On Him

  • మామపై సంచలన ఆరోపణలు చేసిన అల్లుడు
  • అంబటి రాంబాబు అంత నీచుడిని నా జీవితంలో చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు
  • మంచితనం, మానవత్వం ఏ కోశానా లేని వ్యక్తి అంటూ ఫైర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబుపై ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. తన మామకు ఓటేయొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు డాక్టర్ గౌతమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. ఈ వీడియోను టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ రీ పోస్టు చేసింది. వీడియోలో ఆయన చేసిన ఆరోపణలు యథాతథంగా..

‘‘నమస్కారం.. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడిని. అది నా దురదృష్టం. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. అయితే, ఈ వీడియో చేయాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించి, చేయటం నా బాధ్యత అనుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో ఇంతవరకూ చూడలేదు. రోజూ పొద్దున దేవుడికి దండం పెట్టుకునేటపుడు ఇంతటి నీచుడిని నా జీవితంలో ఇంకోసారి ఎంటర్ చేయద్దు స్వామీ అని మొక్కుకుంటున్నా. అంత భయంకరమైన వ్యక్తి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. తను పోటీ చేయబోయే పోస్టు అలాంటిది. ఏ పోస్టుకు అయితే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో అవేమీ లేని వ్యక్తి అంబటి రాంబాబు.

అఫ్ కోర్స్.. అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో అన్ని లక్షణాలు ఉండక్కర్లేదు. అయితే, ఇందులో 0.0001 శాతం లక్షణాలు కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వారికి ఓటేస్తున్నామంటే మనకు తెలియకుండానే కొన్నింటిని ప్రోత్సహిస్తున్నట్లు. సమాజంలో ఎవరైతే నిస్సిగ్గుగా, ఎంత పెద్ద అబద్ధాన్నైనా పెద్ద గొంతేసుకుని నిజం చేయొచ్చనే కాన్ఫిడెన్స్ తో బతుకుతారో అలాంటి వారికి ఓటేస్తున్నట్లు.. ఎంత లేకిపనైనా చేసి సమాజంలో చాలా హుందాగా బతకొచ్చు అని అనుకునే వాళ్లకు ఓటేస్తున్నట్లు.. ఏదైనా చేయొచ్చు, సిగ్గులేకుండా సిగ్గులేనితనాన్ని ప్రోత్సహించవచ్చని అనుకునే వాళ్లకు ఓటేస్తున్నట్లు.. ఇలాంటి వాళ్లకు ఓటేస్తే సమాజం తలరాత మారి రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీనిని ప్రజలు గమనించి, సరైన బాధ్యతతో ఓటువేసి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని, ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు’’ అంటూ డాక్టర్ గౌతమ్ ఈ వీడియోలో పేర్కొన్నాడు.

,

Ambati Rambabu
Ambati Son In Law
Allegations
YSRCP
Andhra Pradesh
AP Elections
Viral Videos

More Telugu News