GT VS RCB: జీటీపై ఆర్సీబీ ఘన విజయం.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
- చిన్నస్వామి స్టేడియంలో శనివారం జీటీ వర్సెస్ ఆర్సీబీ
- దయాళ్, వైశాఖ్, సిరాజ్ చెలరేగడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన జీటీ
- ఛేదనలో అదరగొట్టిన విరాట్, డుప్లెసిస్
- మిడిలార్డర్ కాస్త తడబడ్డా చివర్లో విజయం అందుకున్న ఆర్సీబీ
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన జీటీ.. ఆర్బీబీ పేసర్లు యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్‌కుమార్, ముహమ్మద్ సిరాజ్‌ల ధాటికి కేవలం 147 పరుగులకే ఆలౌటైంది. ఈ స్టేడియంలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. షారుఖ్ ఖాన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ప్రయత్నించినా జట్టుకు భారీ స్కోరు అందించడంలో విఫలమయ్యారు.
దయాళ్, వైశాఖ్, సిరాజ్ మంచి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆర్సీబీని సునాయసంగా కట్టడి చేశారు. చెరో రెండు వికెట్లు తీశారు. వారితో పాటు కెమరూన్ గ్రీన్, కర్ణ శర్మ కూడా చెరో వికెట్ తీయడంతో ఆర్బీ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవ్వాల్సి వచ్చింది.
ఛేదనలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి డుప్లెసిస్, కోహ్లీ అద్బుత ఆరంభాన్ని ఇచ్చారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోయారు. బౌండరీలతో హోరెత్తించారు. వారి 64 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేసింది. కానీ, ఆ తరువాత ఊహించని విధంగా జీటీ బౌలర్ల దెబ్బకు ఆర్సీబీ స్వల్ప వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. చివర్లో దినేశ్ (21), స్వప్నిల్ (15) టీంను ఆదుకోవడంతో 13. 4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ (2/29) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకోగా జీటీ తొమ్మిదో స్థానానికి దిగజారింది. ముంబై ఇండియన్స్ పదో స్థానానికి పరిమితమైంది.