Mallu Bhatti Vikramarka: అందుకే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువ తలదూర్చను: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య

Revanth Reddy interesting comments on Khammam politics

  • ఖమ్మం జిల్లా పోరాటం, చైతన్యం, పట్టుదల కలిగినదని ప్రశంస
  • ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఖమ్మం జిల్లావాళ్లతో పెట్టుకోవద్దని సరదాగా భట్టివిక్రమార్కతో అంటుంటానన్న సీఎం
  • ఉపముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించిన సీఎం

ఖమ్మం జిల్లా వారికి పట్టుదల, చైతన్యం ఎక్కువని, అనుకున్నదాని కోసం ఎంతదూరమైనా వెళతారని, అందుకే తాను ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఖమ్మం జిల్లా ప్రజలపై, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై ప్రశంసలు కురిపించారు.

'ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటం, చైతన్యం, పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు భట్టివిక్రమార్క గారితో అప్పుడప్పుడు నవ్వుతూ అంటుంటా... అయ్యా నాయనా ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గానీ మీ ఖమ్మం జిల్లా వాళ్లతో పెట్టుకోవద్దు అంటుంటాను. ఎందుకంటే, మీరు అనుకున్నదాని కోసం ఎంత దూరమైనా వెళ్లి కొట్లాడుతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువ తలదూర్చకుండా దగ్గరగా ఉన్నట్లుగా ఉండి దూరం నుంచే నమస్కారం పెడుతుంటా' అని ముఖ్యమంత్రి అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు ఓ మాట చెప్పారని, ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లో 22 జిల్లాలకు మాత్రమే ముఖ్యమంత్రివని, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కార్యకర్త ఒక ముఖ్యమంత్రిగా ఉంటాడని, వారి సమస్యలపై వారే కొట్లాడుకుంటారని, వారికి వారే నాయకత్వం వహించుకుంటారని, వారికి వారే పార్టీని గెలిపించుకుంటారని నాడు చెప్పారన్నారు. మనం వారికి సహకరించాలి తప్ప ఎక్కువగా కలుగజేసుకోవద్దని నాడు వైఎస్‌కు ఢిల్లీ పెద్దలు చెప్పిన విషయాన్ని తాను కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఢిల్లీ పెద్దలు అహ్మద్ పటేల్ చెప్పారన్నారు.

'ఖమ్మం జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. గొప్ప పోరాటపటిమ ఉంది. ఏ చైతన్యమైనా... ఏ రైతుకూలీ సమస్యపై పోరాటమైనా... రైతుల హక్కుల మీద, కార్మికుల హక్కుల మీద... ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లా కొట్లాడుతుంది. ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం పాల్వంచ నుంచి ప్రారంభమైంది. ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం పునాది వేసి... జైతెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ... ఖమ్మం జిల్లాది.  మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు చేసిన పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడింద'ని ఖమ్మం ప్రజలపై ప్రశంసలు కురిపించారు.

భట్టివిక్రమార్కపై ప్రశంసలు

ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మనకు అప్పగిస్తే భట్టివిక్రమార్క గట్టోడు కాబట్టి నిధులు సర్దుతున్నారన్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు.

Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Congress
BRS
BJP
  • Loading...

More Telugu News