: విద్యార్ధులకు సీబీఐ జేడీ మూడు సూత్రాలు


విద్యార్ధులకు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మూడు ముఖ్యమైన సూత్రాలను సూచించారు. మొదటిది.. ఏదో ఒకరోజు మీ తల్లిదండ్రులు మీ వద్దకు వచ్చి మన ఇంటిపేరును నిలబెట్టావని మిమ్మల్ని పొగడాలన్నారు. రెండవది.. ఏ స్కూలు, ఏ కళాశాలలో అయితే మీరు చదివారో ఆ స్కూలు, కళాశాలకే ముఖ్య అతిధిగా వెళ్లగలిగే స్థాయికి చేరుకోవాలన్నారు. ఇక మూడవది.. ఒకరినుంచి ఆటోగ్రాఫ్ లు తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్ లు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పారు. వీటినెప్పుడూ ప్రతి కార్యక్రమంలోనూ తాను చెబుతుంటానన్నారు. ఈ మూడింటిని గుర్తుపెట్టుకుంటే పుస్తకాల్లోని పాఠ్యాంశాలతో పాటు సద్గురువులు మీ జీవిత చరిత్రలను కూడా ఇతరులకు బోధిస్తారన్నారు. భారతదేశంలో అత్యధికంగా యువకులు ఉన్నారన్న జేడీ, అందరూ సక్రమ మార్గంలో నడిస్తే ఒకమంచి భారతదేశాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.

జీవితంలో డబ్బే ప్రధానం కాదన్న లక్ష్మీనారాయణ, ఉత్తమ సంపాదన, మధ్యమ సంపాదన, అతి నీచమైన సంపాదన అని మూడు రకాలున్నాయన్నారు. కాబట్టి, అందరూ ఉత్తమ మార్గంలోనే డబ్బు సంపాదించాలని జేడీ విద్యార్ధులకు సూచించారు. లంచాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నా తీసుకోనివాడే గొప్పవాడని, ఆంగ్లం తెలిసి కూడా తెలుగులో మాట్లాడేవాడే గొప్ప వాడనీ జేడీ పలు మంచి విషయాలు బోధించారు. ఈ కోవలేనే విద్యార్ధులు కూడా ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. అబ్దుల్ కలాం ఆశించినట్లు 2020 కల్లా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసి 'దేశం అంటే ఇది, పౌరులంటే ఇలా ఉండాలని' చెప్పగలగాలని ఆకాంక్షించారు. దీనిని విద్యార్ధులు ఆచరణలో పెట్టగలరని ఆశిస్తున్నట్లు హైదరాబాదులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జేడీ కోరారు.

  • Loading...

More Telugu News