Sourav Ganguly: అందుకే రింకూకు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు: సౌరవ్ గంగూలీ
- టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికపై మీడియాతో మాట్లాడిన దాదా
- జట్టులో స్పిన్నర్ కావాలనుకోవడంతోనే రింకూ సింగ్‌కు చోటు దక్కలేదన్న గంగూలీ
- టీమిండియా తరఫున అతడు ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని వ్యాఖ్య
రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం మంగళవారం (ఏప్రిల్ 30) బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన తుది జట్టులో యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు రింకూకు టీమిండియాలో చోటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పొట్టి ఫార్మాట్‌కు అతని బ్యాటింగ్ శైలి సరిగ్గా సరిపోతుందని, ఇప్పటికే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ విషయాన్ని రుజువు చేశాడనేది వారి వాదన. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికపై మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రింకూ విషయమై కూడా ఆయన మాట్లాడారు.
మీడియాతో దాదా మాట్లాడుతూ.. "జట్టులో స్పిన్నర్ కావాలనుకోవడంతోనే రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. అతనికి ఇంకా చాలా కెరీర్ ఉంది. టీమిండియా తరఫున ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ నిర్ణయంపై అతడు నిరుత్సాహపడకూడదని భావిస్తున్నా. ఇక జట్టు ఎంపిక చేయడంలో సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా పని చేశారు. నేను చూసిన అత్యుత్తమ జట్లలో ఇది ఒకటి" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఇక జూన్ 2వ తేదీ నుంచి ఈ ఐసీసీ టోర్నీకి తెరలేవనుంది. జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన భారత్, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
టీ 20 ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే
భారత్ వర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
భారత్ వర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
భారత్ వర్సెస్ యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
భారత్ వర్సెస్ కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)