Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
- తిరుమల కొండపై 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం
- నిన్న స్వామివారికి రూ.2.96 కోట్ల ఆదాయం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
నిన్న ఒక్కరోజే తిరుమల వెంకన్నను 62,624 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,638 మంది భక్తులు తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.2.96 కోట్ల ఆదాయం వచ్చింది.
తిరుమలలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. కొండపై ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న భక్తులు వాతావరణం మారడంతో హాయిగా ఆస్వాదిస్తున్నారు. నిన్న కూడా తిరుమలలో వడగళ్ల వాన కురిసింది.