Kesineni Nani: తమ్ముడు కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేసిన కేశినేని నాని

Kesineni Nani sensational allegations on his brother Kesineni Chinni

  • విజయవాడ లోక్ సభ స్థానంలో అన్నదమ్ముల సవాల్
  • వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని
  • టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని (శివనాథ్)
  • ఓ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చిందన్న కేశినేని నాని
  • ఆ వ్యక్తి తన తమ్ముడు కావడం దురదృష్టకరమని వ్యాఖ్యలు

విజయవాడ లోక్ సభ స్థానం వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తన సోదరుడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్)పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తి (కేశినేని చిన్ని)కి టీడీపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. అతడు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టే అతడి విషయాలు వెల్లడించాల్సి వస్తోందని కేశినేని నాని అన్నారు. అతడు చార్లెస్ శోభరాజ్ ను మించిన ఘనుడు అంటూ వ్యాఖ్యానించారు. 

"కేశినేని చిన్ని, నేను పాతికేళ్ల కిందట విడిపోయాం. ఇప్పుడు అతను టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు... అతడి చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలియాలి. చాలాసార్లు అప్పుల పాలయ్యాను అని చెప్పి మోసం చేశాడు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేకపోతున్నాను, బాడుగ కట్టలేకపోతున్నాను అంటే ఆదుకున్నాను. 

ఓసారి నూజివీడులో భూ కబ్జాకు ప్రయత్నించాడు. దాంతో అతడ్ని నా ఆఫీసుకు రావొద్దని చెప్పాను. నా పేరు చెడగొట్టే పనులు చేయవద్దని మందలించాను. 

2020 వరకు తనకేమీ ఆదాయం లేదని చిన్ని చెబుతున్నాడు... కానీ అతడి అఫిడవిట్ చూస్తే 2002 నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ బకాయి ఉందని వెల్లడైంది. ప్రతి 6 నెలలకు ఓసారి ఇల్లు మార్చుతూ ఐటీ నోటీసులు తీసుకోవడంలేదు. అతడు చేసేవన్నీ చీటింగ్ లే. చిన్ని పెట్టిన కంపెనీలన్నీ సూట్ కేసు కంపెనీలనేనని కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది. 

కేశినేని డెవలపర్స్ సంస్థ కోసం 2016లో నా సంతకం ఫోర్జరీ చేశాడు. అభివృద్ధిలోకి వస్తాడని భావిస్తే కేశినేని డెవలపర్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. తెలంగాణలో 'రేరా' జరిమానా కూడా విధించింది. ఒక సంస్థతో కలిసి చిన్ని మోసాలకు పాల్పడగా, ఇప్పుడా సంస్థ యజమాని జైల్లో ఉన్నాడు.

హైదరాబాద్ ప్రగతి నగర్ లో 97 ఎకరాల భూమిని ఓ మాజీ మంత్రితో కలిసి కబ్జా చేశాడు. ఎక్సెల్లా ప్రాపర్టీస్ పేరిట ప్రీ లాంచ్ అంటూ ఆ స్థలాలను పేదలకు అమ్మేశాడు. ఈ వ్యవహారం కోర్టుకెక్కితే... ఈ సంస్థతో తమకు సంబంధం లేదని, ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేశానని బుకాయిస్తున్నాడు. 

చిన్ని గతంలో తన వాహనాలకు 5555 నెంబర్లు వాడేవాడు... నేను 7777 నెంబర్లు వాడేవాడ్ని. నేను ఎంపీ అయ్యాక, నా పేరు వాడుకోవడానికి అతడు కూడా 7777 నెంబర్లు వాడడం మొదలుపెట్టాడు. తన కార్లకు ఎంపీ స్టిక్కర్లు వేసుకునేవాడు. తన రియల్ ఎస్టేట్ దందా కోసం నా పదవిని అడ్డంపెట్టుకున్నాడు. నా ఎంపీ స్టిక్టర్లు నకిలీవి తయారుచేస్తుంటే నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు అయితే ప్రజలు, సమాజం పరిస్థితి ఏంటి?" అంటూ కేశినేని నాని ధ్వజమెత్తారు. 

విజయవాడలో గతంలో పలువురు మచ్చలేని నాయకులు ఎంపీలుగా పనిచేస్తే, ఈసారి కేశినేని చిన్ని వంటి నేరచరితుడు టీడీపీ నుంచి పోటీచేస్తుండడం బాధాకరమని అన్నారు. ఆ వ్యక్తి తన తమ్ముడు కావడం దురదృష్టకరమని నాని అభివర్ణించారు.

More Telugu News