Jupiter: జూపిటర్ ఉపగ్రహం ‘అయో’పై ఓ భారీ టవర్.. ఏమిటది?
- ‘అయో’కు సమీపంలోకి వెళ్లినప్పుడు గుర్తించిన ‘జునో’ స్పేస్ క్రాఫ్ట్
- ‘అయో’ ఉత్తర ప్రాంతంలోని లోకి పటెరాలో టవర్
- దాని చుట్టూ అద్దంలా నున్నగా ఉన్న నేల భాగం
మన సౌర కుటుంబంలో భూమ్మీద కాకుండా మరెక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అందుకు అవకాశమున్న గ్రహాలు ఉపగ్రహాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గురుడు, శని చుట్టూ తిరుగుతున్న కొన్ని ఉప గ్రహాల్లో మంచు, నీళ్లు, జీవానికి తోడ్పడే ఇతర పదార్థాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు. తాజాగా.. గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం ‘అయో’పై పరిశోధనలు చేస్తుండగా.. ఓ భారీ టవర్ వంటి ఆకారాన్ని గుర్తించారు.
నాసా ‘జునో’ స్పేస్ క్రాఫ్ట్ తో..
గురుగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనలు చేస్తున్న నాసా ఉపగ్రహం ‘జునో’ స్పేస్ క్రాఫ్ట్.. ప్రస్తుతం ‘అయో’పై ఫోకస్ చేసింది. ఇటీవలే ‘అయో’పై కేవలం 1,500 కిలోమీటర్ల మీదుగా ప్రయాణిస్తూ.. దాని ఉపరితలాన్ని చిత్రీకరించింది. ఈ సమయంలో ఓ భారీ టవర్ ను, దాని చుట్టూ అద్దంలా నున్నగా ఉన్న నేల భాగాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏమిటా టవర్?
‘అయో’ ఉప గ్రహం పెద్ద సంఖ్యలో అగ్నిపర్వతాలతో నిండి ఉందని.. అందులో కొన్ని ఇంకా యాక్టివ్ గా లావాను వెదజల్లుతున్నాయని నాసా శాస్త్రవేత్త స్కాట్ బోల్టన్ తెలిపారు. ‘అయో’ ఉత్తర ప్రాంతంలో లోకి పటెరాగా పిలిచే ప్రాంతంలోని ఓ అగ్ని పర్వతం నుంచి వెలువడిన లావా అతి పెద్ద టవర్ లా ఏర్పడినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో లావా అతి మెల్లగా గట్టిపడుతూ.. అద్దంలా మెరిసిపోతున్నట్టు వివరించారు.