Chandrababu Naidu: ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు
- సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత
- ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం
- అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజల భూములు ఏమైనా జగన్ తాత కొనిచ్చాడా లేకుంటే ఆయనేమన్నా వారసుడా? అని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరో మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో కలిసి ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. తామిద్దరం సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ పట్టా పాసు పుస్తకాలపై మా ఫొటోలు వేసుకున్నామా? అని అక్కడ ఉన్న ప్రజలను చంద్రబాబు అడిగారు.
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని, హక్కుదారు చేతికి వాటి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి? అని మండిపడ్డారు. అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రజలు ఇది గ్రహించాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.