Triple Talaq: కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన భర్త.. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు మొర పెట్టుకున్న భార్య!
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన
- బాధితురాలు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకోవడంతో వెలుగులోకి వ్యవహారం
- తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి బాధిత మహిళను రెండో పెళ్లి చేసుకున్న నిందితుడు అర్షద్
- ఆ తర్వాత అదనపు కట్నం కోసం పేరెంట్స్ తో కలిసి భార్యకు వేధింపులు
కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన ఘటన కలకలం రేపింది. భార్య నిలదీయడంతో జుట్టు పట్టుకుని ఆమెను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు భోగానిపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడితో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అర్షద్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి 12న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన గ్రాడ్యుయేట్ అఫ్సానాను వివాహం చేసుకున్నాడు. మ్యాట్రిమోనియల్ సైట్‌లో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటయింది. ఇక పెళ్లయిన తర్వాత భర్త, అత్తమామలు అఫ్సానాను అదనపు కట్నం కోసం వేధించడం మొదలెట్టారు.
ఈ క్రమంలో ఈ జంట గత వారం పుఖ్రాయన్‌లోని అర్షద్ పూర్వీకుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలోనే అఫ్సానాకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. అర్షద్‌కు అప్పటికే వివాహమైందని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా తనతో నిఖా చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇదే విషయమై అతడిని నిలదీసింది. దాంతో అర్షద్‌తో పాటు అతని తల్లి కట్నం కోసం వేధించడం ఇంకా ఎక్కువైందని ఆమె వాపోయింది.
ఆ తర్వాత విషయం పోలీసుల వరకు చేరడంతో రాజీ కుదిర్చేందుకు యత్నించారని తెలిపింది. ఈ క్రమంలో భార్యతో కలిసి భోపాల్ వెళ్లి ఉంటానని అర్షద్ చెప్పాడు. దాంతో ఏప్రిల్ 29న భర్తతో కలిసి రైలులో అఫ్సానా భోపాల్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే అర్షద్ తన సామాన్లు తీసుకుని ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో అఫ్సానా అతన్ని ప్రశ్నించింది. తాను ఇంటికి వెళ్తున్నానని, ఇక తనతో ఉండబోనని చెప్పాడు. భార్య నిలదీయడంతో ఆమె జుట్టు పట్టుకుని దాడిచేసి, ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పి రైలు దిగి పారిపోయాడు.
దాంతో బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళలకు విడాకులు ఇచ్చి వారిని విడిచిపెడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరింది. ఇక అఫ్సానా ఫిర్యాదు మేరకు ఆమె భర్త అర్షద్, అతడి మామ అకీల్, తండ్రి నఫీసుల్ హసన్, తల్లి పర్వీన్‌లపై కేసు నమోదు చేసినట్లు భోగానిపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) ప్రియా సింగ్ తెలిపారు.