Machilipatnam: జనసేన నేత ఇంటిపై దాడి... మచిలీపట్నంలో ఉద్రిక్తత

Tensions raise in Machilipatnam

  • ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పేర్ని కిట్టు
  • జనసేన నేత కర్రి మహేశ్ ఇంటి ఎదుట బాణసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు
  • నిలదీసిన మహేశ్ కుటుంబ సభ్యులు
  • దాడికి పాల్పడిన కిట్టు అనుచరులు
  • పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన టీడీపీ, జనసేన శ్రేణులు
  • ఎస్పీ కార్యాలయానికి తరలి వెళ్లిన కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు వర్గీయులు జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. పేర్ని కిట్టు మచిలీపట్నంలోని ఓ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. 

జనసేన నేత కర్రి మహేశ్ ఇంటి ఎదుట వైసీపీ నేతలు బాణసంచా కాల్చడంతో, కర్రి మహేశ్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటి ఎదుట కాల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దాంతో రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు... మహేశ్ ఇంటి వద్ద వీరంగం వేశారు. ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేసినట్టు తెలిసింది. 

ఈ నేపథ్యంలో, జనసేన, టీడీపీ నేతలు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ జనసేన, టీడీపీ నేతలు, కర్రి మహేశ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాగా, బాధితులకు మాజీ మంత్రి, మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నాయకుడు బండి రామకృష్ణ మద్దతు పలికారు. 

అంతేకాదు, కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి తరలి వెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.

Machilipatnam
Janasena
TDP
YSRCP
Krishna District
  • Loading...

More Telugu News