Balka Suman: ఇంతకంటే సిగ్గుమాలిన చర్య లేదు: ఇంద్రకరణ్ రెడ్డిపై బాల్క సుమన్ తీవ్ర విమర్శలు

Balka Suman fires at Indrakaran Reddy

  • పదేళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించాడన్న బాల్క సుమన్
  • కష్టకాలంలో పార్టీ మారడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లేనని వ్యాఖ్య
  • సావుదలకు ఆ పార్టీలోకి వెళితే ఏముంటుందని ప్రశ్న
  • కాంగ్రెస్ నిలబెట్టిన వారిలో నలుగురు అభ్యర్థులు మా పార్టీవారే అన్న సుమన్

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇంతకన్నా నీతిమాలిన, సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు రెండుసార్లు మంత్రిగా కేసీఆర్ అవకాశమిచ్చారన్నారు. ఓ పార్టీ అంతకంటే ఎక్కువ అవకాశం ఏమి ఇస్తుంది? అని ప్రశ్నించారు.

సావుదలకు (చావుకు) ముందు అందులోకి (కాంగ్రెస్) వెళ్లి చేసేది ఏముంటుంది? అని నిలదీశారు. కేసీఆర్ రెండుసార్లు ఆయనకు అంతగా ప్రాధాన్యత ఇస్తే ఇలా చేశారన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమలాంటి వారికి, సీనియర్లకు, కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారికి కూడా మంత్రిగా అవకాశం రాలేదని, కానీ ఇంద్రకరణ్‌కు కేసీఆర్ ఆ అవకాశం ఇచ్చారన్నారు. అందుకే నిర్మల్ నియోజకవర్గ ప్రజలు ఇంద్రకరణ్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఇంద్రకరణ్ పార్టీ మారిన ప్రభావం ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాలపై పడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గుతాయన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు.

నాలుగు సీట్లలో కాంగ్రెస్ తమ పార్టీ నుంచి తీసుకున్న అభ్యర్థులనే నిలబెట్టిందని విమర్శించారు. ఈ నాలుగు సీట్లలో కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మ‌ల్కాజ్‌గిరిలో సునీతా మ‌హేంద‌ర రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేంద‌ర్, చేవెళ్ల‌లో రంజిత్ రెడ్డి, వ‌రంగ‌ల్‌లో క‌డియం కావ్య‌.. ఈ న‌లుగురిని బీఆర్ఎస్ నుంచి తీసుకుని పోయారన్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందని, ఈ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని నాలుగు రోజుల క్రితం సునీల్ క‌నుగోలు రిపోర్టు ఇచ్చారన్నారు.

Balka Suman
BRS
Congress
Indrakaran Reddy
  • Loading...

More Telugu News