Narendra Modi: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ తెచ్చింది... ఢిల్లీలో గెలిస్తే 55 శాతం మీ సంపదను లాక్కుంటుంది: మోదీ హెచ్చరిక
- తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్నారన్న ప్రధాని
- ఈ డబుల్ ఆర్ అంటే తెలుసునని వ్యాఖ్య
- ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సగం సంపదను తీసుకుంటుందని విమర్శ
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులన్న ప్రధాని మోదీ
- లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని తేలిందని వ్యాఖ్య
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. వ్యాపారవేత్తలు ఈ డబుల్ ఆర్ పన్నును కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ మళ్లీ పాతరోజులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం పూర్తి అవినీతిమయమైందని ఆరోపించారు.
ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుంది
డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే బీజేపీని గెలిపించాలని కోరారు. డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి చేరుతోందని, ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ పైన విస్తృత చర్చ సాగుతోందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్‌తో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇలాంటి ట్యాక్స్ వేస్తున్న కాంగ్రెస్‌కు మనం షాక్ ఇవ్వకుంటే రానున్న అయిదేళ్లు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని విమర్శించారు.
కాంగ్రెస్ గెలిస్తే మీపై వారసత్వ పన్ను వేస్తుంది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారసత్వ సంపదపై పన్నును తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు మన సంపాదనలో 55 శాతం మన పిల్లలకు దక్కకుండా ప్రభుత్వానికి పోతుందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదన్నారు. మేం అధికారంలోకి వస్తే మీ సంపదలో 55 శాతం వాటాను లాక్కుంటామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లలో దోచుకుతిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై పదేపదే మాట్లాడిందని, ఇప్పుడు మాత్రం ఆ అవినీతి ఫైళ్లను తొక్కి పెట్టిందని ఆరోపించారు.
లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని తేలింది
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కాం వరకు పాకిందని విమర్శించారు. లిక్కర్ స్కాం బయటపడ్డాక ఇద్దరూ తోడుదొంగలని తేలిందన్నారు. వందరోజుల్లో రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రూ.500 పంట బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను పేదలుగానే ఉంచేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మహిళాశక్తి కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. కేంద్రం నిర్మించే పక్కా ఇళ్లను కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు.
బీజేపీ పదేళ్ల కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, మాఫియా, కుటుంబ రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పంచసూత్రాలు ఇవేనని ఎద్దేవా చేశారు.