Bihar: అత్తను ప్రేమించి పెళ్లాడిన అల్లుడు! వీడియో వైరల్

bihar man falls in love with mother in law and marries her

  • బిహార్ లో వెలుగులోకి వచ్చిన విచిత్ర సంఘటన
  • వారి ప్రేమాయణాన్ని బట్టబయలు చేసిన మామ
  • గ్రామ సర్పంచ్ ముందు జరిగిన పంచాయితీ
  • అత్త నుదుటన సిందూరం దిద్ది పెళ్లి చేసుకున్న అల్లుడు

బిహార్ లో విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. పిల్లనిచ్చిన అత్తను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు! ఊరందరి ముందు ఆమె నుదుట సిందూరం దిద్దాడు! ఆపై రిజిస్ట్రార్ ఆఫీసులోనూ ఇరువురూ సంతకాలు చేసి చట్టబద్ధంగా దంపతులయ్యారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం 45 ఏళ్ల సికందర్ యాదవ్ కు గతంలో పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతని భార్య చనిపోవడంతో తన పిల్లలను తీసుకొని అత్తారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 55 ఏళ్ల అత్త గీతా దేవితో అతనికి సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే వారు సన్నిహితంగా మెలుగుతుండటాన్ని గుర్తించిన సికందర్ మామ దిలీశ్వర్ దార్వేకు వారిపై అనుమానం కలిగింది. ఒకరోజు వారిద్దరి గుట్టు రట్టు చేశాడు. వెంటనే ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయితీ పెట్టాడు.

అయితే అనూహ్యంగా సికందర్ యాదవ్ అందరి ముందు తాను అత్తను ప్రేమిస్తున్నట్లు ప్రకటించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని మనసులో మాటను బయటపెట్టాడు. దీంతో ఇక చేసేది లేక మామ కూడా అందుకు ఒప్పుకోవడంతో గ్రామస్తుల సమక్షంలో సికందర్ అత్త నుదుటిన సిందూరం దిద్దాడు. ఈ అసాధారణ సన్నివేశాన్ని గ్రామ ప్రజలంతా తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. కొత్త దంపతులకు తమ హర్షాతిరేకాలు తెలియజేశారు.

ఈ ఘటనపై సికందర్ మామ మీడియాతో మాట్లాడుతూ..  తన భార్యతో అల్లుడి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నట్లు చెప్పాడు. గ్రామస్తుల సమక్షంలో పెళ్లి జరిగాక వారిద్దరికీ రిజిస్టర్ మ్యారేజీ జరిపించే బాధ్యత కూడా అతనే తీసుకోవడం గమనార్హం.

More Telugu News