West Bengal: సందేశ్ ఖలీ దాడుల బాధితురాలికి ‘ఎక్స్’ కేటగిరీ భద్రత!
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం
- బెంగాల్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రా
- ఆమెకు భద్రత కల్పించనున్న సీఐఎస్ ఎఫ్ కమాండోలు
పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖలీలో మహిళలపై లైంగిక దాడులు, హింసకు వ్యతిరేకంగా మొదట గళమెత్తిన బాధితురాలు రేఖా పాత్రాకు కేంద్ర హోం శాఖ ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించింది. ఆమె ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బసీర్ హత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
రేఖా పాత్రా ఫిర్యాదు చేయడం వల్లే సందేశ్ ఖలీ దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
మీడియా కథనాల ప్రకారం ఆమెకు కేంద్ర పారిశ్రామిక భధ్రతా దళాల (సీఐఎస్ ఎఫ్)కు చెందిన కమాండోలు భద్రత కల్పించనున్నారు. చివరి దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న బసీర్ హత్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన హాజీ నూరుల్ ఇస్లాంపై రేఖా పాత్రా పోటీచేస్తున్నారు. అక్కడి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ బెంగాలీ నటి నూస్రత్ జహాన్ ను వేరే చోటకు తృణమూల్ మార్చింది. ఈ ఎన్నికల్లో శక్తివంచన లేకుండా నిజాయతీగా పనిచేస్తానని రేఖా పాత్రా చెప్పింది. తనపై నమ్మకంతో పేద కుటుంబానికి చెందిన తనకు ప్రధాని మోదీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని చెప్పింది. సందేశ్ ఖలీలో మహిళలపై దాడులకు అడ్డుకట్ట పడేలా చూడటమే తన లక్ష్యమని తెలిపింది. కాగా, మరో ఐదుగురు బెంగాల్ బీజేపీ అభ్యర్థులకు కూడా కేంద్రం భద్రత పెంచింది.