harvard university: హార్వార్డ్ లో పాలస్తీనా జెండా ఎగరేసిన నిరసనకారులు

Palestinian Flag Raised At Harvard As Protests Intensify At US Universities

  • వివిధ వర్సిటీల్లో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారుల మధ్య ఘర్షణలు
  • ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నా వెనక్కి తగ్గని విద్యార్థులు
  • గత వారం వ్యవధిలో 275 మంది నిరసనకారుల అరెస్టు

అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడంతో కొలంబియా యూనివర్సిటీలో మొదలైన నిరసనలు దాదాపు అన్ని వర్సిటీలకు విస్తరించాయి. ఆందోళనలపై పోలీసులు, వర్సిటీల అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని ఇవీ లీగ్ స్కూల్ వద్ద నిరసనకారులు భారీ సైజులో ఉన్న పాలస్తీనా జెండాను ఎగరేశారు. అమెరికా జెండా ఎగరేసేందుకు ఉద్దేశించిన ప్రదేశంలో వారు పాలస్తీనా జెండా ఎగరేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ కరెస్పాండెంట్ల అసోసియేషన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన వార్షిక డిన్నర్ కు వేదికైన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ పైఅంతస్తులో భారీ పాలస్తానా జెండాను ఎగరేశారు.

పోలీసులు గత వారం రోజుల్లో నాలుగు కాలేజీ క్యాంపస్ ల నుంచి 275 మందిని అరెస్టు చేశారు. బోస్టన్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ, ఇండియానా యూనివర్సిటీలో ఈ అరెస్టులు జరిగాయి.

ఇక లాస్ ఏంజెలిస్ లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. గాజాలో హమాస్ పై దాడిని ఇజ్రాయెల్ ఆపాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో లాభపడుతున్న కంపెనీలతో కాలేజీలు సంబంధాలు తెంచుకోవాలని పట్టుబడుతున్నారు.

అయితే ఈ నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులు విద్వేషపూరిత ప్రసంగాలు, యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వర్సిటీల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆందోళనకారుల చర్యలు భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో అధికారులకు సవాల్ విసురుతున్నాయి.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. గాజా సరిహద్దులోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి విషయంలో తమ వైఖరిని పునరుద్ఘాటించారు. 

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన మెరుపుదాడిలో 1,170 మంది మరణించారు. అలాగే 250 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. దీంతో గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న ఎదురుదాడిలో 3,400 మందికి పైగా మృతి చెందారు.

More Telugu News