Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత క‌ల‌క‌లం!

Leopard Spotted In Shamshabad Airport

  • మొద‌ట అడ‌వి పిల్లిగా భావించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది
  • సీసీటీవీ కెమెరాల‌లో రికార్డ‌యిన దృశ్యాల‌ను ప‌రిశీలించి చిరుత‌గా నిర్ధారించిన అట‌వీశాఖ అధికారులు
  • చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్ల ఏర్పాటు
  • గొల్ల‌ప‌ల్లి గ్రామం నుంచి విమానాశ్ర‌యం ప్రహరీ దూకి లోప‌లికి వ‌చ్చిన‌ట్లు గుర్తించిన‌ అధికారులు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మొద‌ట దానిని అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన అనంత‌రం దాన్ని చిరుత‌గా నిర్ధారించారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆర్‌జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. 

ప్ర‌స్తుతం ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల‌లో అట‌వీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గొల్ల‌ప‌ల్లి గ్రామం నుంచి విమానాశ్ర‌యం గోడ దూకి లోప‌లికి వ‌చ్చిన‌ట్లు అధికారులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ప్రహరీ గోడ దూకే స‌మ‌యంలో చిరుత ఫెన్సింగ్ వైర్ల‌ను తాకిన ఆన‌వాళ్ల‌ను అధికారులు గుర్తించ‌డం జ‌రిగింది. మూడేళ్ల క్రితం కూడా ఇలాగే చిరుత ఎయిర్‌పోర్టులో తిరిగినట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే, సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించిన అధికారులు దాన్ని అడ‌వి పిల్లిగా గుర్తించారు. ఈసారి కూడా అడ‌వి పిల్లినే కావొచ్చ‌ని మొద‌ట ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమానించింది. కానీ, అట‌వీశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించి చిరుత‌గా నిర్ధారించారు.

More Telugu News