RSS: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ వైఖరి గురించి మోహన్ భాగవత్ ఏం చెప్పారంటే..!
- ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణ
- రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వివరణ
- అవసరమైనంత కాలం ఉండాల్సిందేనన్న భాగవత్
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తోసిపుచ్చారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు కల్పించిన ఈ వెసులుబాటు సమాజంలో అవసరం ఉన్నంతకాలం కొనసాగించాల్సిందేనని భాగవత్ తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు తయారుచేసి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారంలో పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వీడియోలతో సమాజంలో వివిధ వర్గాల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని ఈ సందర్భంగా యువతకు హితవు పలికారు.