Elon Musk: చైనాకు బయలుదేరిన ఎలాన్ మస్క్.. సర్ ప్రైజ్ ట్రిప్ వెనక మతలబేంటో?

Elon Musk heads to China a week after he postponed India visit

  • ఈ వారంలో ఇండియాకు వచ్చేందుకు గతేడాది జూన్ లోనే ప్లాన్ చేసుకున్న మస్క్
  • ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి ఏర్పాట్లు కూడా చేసిన అధికారులు
  • చివరి క్షణంలో భారత పర్యటన రద్దు చేసుకున్న టెస్లా అధినేత

ఎలక్ట్రానిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ సడెన్ గా చైనాకు వెళ్లారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సర్ ప్రైజ్ విజిట్ గా ఆదివారం డ్రాగన్ కంట్రీకి బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి ఈ సమయంలో మస్క్ ఇండియా పర్యటనకు రావాలని గతేడాది నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే, చివరి క్షణంలో ఈ పర్యటనను ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్నారు. భారత పర్యటనను మస్క్ రద్దు చేసుకోవడం, అదే సమయంలో చైనాకు సర్ ప్రైజ్ విజిట్ చేయడంపై బిజినెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. మస్క్ చైనా పర్యటనపై స్పందించేందుకు టెస్లా వర్గాలు నిరాకరించనట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. మస్క్ చైనా పర్యటన వివరాలు కూడా అనధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

టెస్లా వాహనాలకు అమెరికా, చైనాలే అతిపెద్ద మార్కెట్.. టెస్లాకు పోటీగా చైనాలో క్సిపెంగ్ అనే కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో చైనాలో టెస్లాకు గట్టిపోటీనిస్తోంది. అమెరికాలో నాలుగేళ్ల క్రితమే పూర్తిస్థాయి ఆటోపైలట్ వ్యవస్థతో టెస్లా కంపెనీ తయారు చేసిన ఎఫ్ఎస్ డీ కారుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కారును తమకూ అందుబాటులోకి తీసుకురావాలని చైనా ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని మస్క్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఎఫ్ఎస్ డీ కారును చైనా మార్కెట్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై చైనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, తొందర్లోనే చైనా మార్కెట్ లోకి ఎఫ్ఎస్ డీ ఎంటర్ అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ డీ తరహా కారును తయారుచేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు చైనా కంపెనీ క్సిపెంగ్ ప్రయత్నిస్తోంది. మస్క్ తాజా పర్యటన వెనక ఎఫ్ఎస్ డీ కారును చైనా మార్కెట్లో రిలీజ్ చేయడంపై చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భారత పర్యటన రద్దు..
టెస్లా కంపెనీ కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఎలాన్ మస్క్ గతంలోనే ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయితే, భారత ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఈ విషయంపై భారత ప్రధాని మోదీతో చర్చించేందుకు ఏప్రిల్ నెలాఖరులో భారత్ కు వస్తున్నట్లు గతంలోనే మస్క్ ప్రకటించారు. కిందటేడాది జూన్ లోనే భారత పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు. ప్రధాని మోదీ నుంచి కూడా తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. అయితే, చివరి క్షణంలో ఈ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నారు.

More Telugu News