Arvinder Singh Lovely: ఢిల్లీలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఎన్నికల వేళ ఢిల్లీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా
- పార్టీలో తాను ‘దివ్యాంగుడి’లా మారానని లవ్లీ ఆవేదన
- పార్టీ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియాతో విభేదాలే కారణం
- ఆప్‌తో పొత్తుపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
- రాజీనామా లేఖను పార్టీ చీఫ్ ఖర్గేకు పంపిన లవ్లీ
కేంద్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌కు ఢిల్లీలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియాతో పొసగకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీలో తాను ‘దివ్యాంగుడి’లా మారానని, పార్టీ ఢిల్లీ చీఫ్‌గా కొనసాగలేనని పేర్కొన్నారు.
తన రాజీనామాకు పలు కారణాలు ఉదహరించిన ఆయన ఢిల్లీ వ్యవహారాల్లో బబారియా జోక్యాన్ని చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. బబారియాను వ్యతిరేకిస్తున్న అసంతృప్త నేతలను బహిష్కరించాలన్న ఒత్తిడి తనపై విపరీతంగా ఉందని లవ్లీ పేర్కొన్నారు. అలాగే, ఆప్‌తో పొత్తుపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు చెప్పారు.