Arvind Kejriwal: సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- తన అరెస్ట్ విషయంలో ఈడీ ఏకపక్షంగా వ్యవహరించిందన్న కేజ్రీవాల్
- ఈడీని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి తన అరెస్ట్ నిదర్శనమని వెల్లడి
- తమకు దక్షిణాది నుంచి ఎలాంటి ముడుపులు రాలేదని స్పష్టీకరణ
లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడం ద్వారా ఏకపక్షంగా వ్యవహరించిందని, విచారణ సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బీజేపీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అణగదొక్కేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ఈడీని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి తన అరెస్ట్ నిదర్శనమన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సమాన పోరాటస్థాయి కల్పించాలన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే తనను అరెస్ట్ చేసిన తీరు ఈడీ ఏకపక్ష వైఖరిని వెల్లడిస్తోందన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో పైచేయి సాధించినట్లుగా ఆరోపించారు.
మద్యం పాలసీ కేసుపై కూడా కేజ్రీవాల్ స్పందించారు. దక్షిణాదికి చెందిన గ్రూప్ నుంచి తమ పార్టీ ముడుపులు తీసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గోవా ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బును ఉపయోగించామనడం సరికాదన్నారు. తమ పార్టీకి ఒక్క రూపాయి కూడా రాలేదని, ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు.