Ukraine: ఉక్రెయిన్​ పై రష్యా భారీ దాడి.. నాలుగు విద్యుత్​ ప్లాంట్ల ధ్వంసం!

ukraine says russia damaged 4 power plants in massive attack

  • శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పరస్పర దాడులు
  • 68 డ్రోన్ లను ప్రయోగించిన ఉక్రెయిన్
  • రష్యాలోని రెండు ఆయిల్ రిఫైనరీలు, మిలటరీ ఎయిర్ ఫీల్డ్ ధ్వంసం

ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో కొంత వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ అతి భారీ స్థాయిలో దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా.. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వరుసగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ లో కీలకమైన నాలుగు విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాపై నియంత్రణలను అమలు చేయాల్సి వస్తున్నట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

మౌలిక సదుపాయాలే లక్ష్యంగా..
పశ్చిమ దేశాల నుంచి అందుతున్న సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తుండటంతో.. రష్యా కొంత కాలం నుంచి ఉక్రెయిన్ లోని విద్యుత్ ప్లాంట్లు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేసింది. వాటిని ధ్వంసం చేయడం ద్వారా ఉక్రెయిన్ ను లొంగదీసుకోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్ పై 34 క్షిపణులను ప్రయోగించిందని.. అందులో 21 క్షిపణులను మధ్యలోనే కూల్చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మిగతావి తాకడంతో నాలుగు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ధ్వంసమైనట్టు వెల్లడించారు. దీనితో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించామని.. పీక్ టైంలో ఐరన్ బాక్స్ లు, వాషింగ్ మెషీన్లు వంటివి వినియోగించవద్దని ప్రజలకు సూచించారు.

దీటుగా దాడికి దిగిన ఉక్రెయిన్
మరోవైపు ఉక్రెయిన్ కూడా శుక్రవారం రాత్రి రష్యా దక్షిణ ప్రాంతమైన క్రాన్సోదర్ రీజియన్ పై దాడికి దిగింది. 68 డ్రోన్ లను ప్రయోగించింది. అందులో 66 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా డిఫెన్స్ అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్ దాడుల్లో స్లవ్యానస్క్ ప్రాంతంలోని రెండు ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి. ఒక మిలటరీ ఎయిర్ ఫీల్డ్ కూడా దెబ్బతింది.

More Telugu News