Maharashtra: మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కావాలి కానీ అభ్యర్థులు వద్దా?: ఖర్గేకు కాంగ్రెస్ నేత ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ లేఖ

Maharashtra Congress Leader Asks Kharge Muslim Vote Chahiye Candidate Kyu Nhi

  • ఎంవీఏ కూటమి తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థినీ నిలబెట్టకపోవడంపై అసంతృప్తి
  • 48 సీట్లలో ముస్లింలకు ఒక్క సీటూ కేటాయించలేరా అంటూ ప్రశ్న
  • పార్టీ ప్రచార బాధ్యతల నుంచి తప్పుకున్న ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. ఎన్నికల బరిలో నిలిపేందుకు ముస్లిం అభ్యర్థి ఒక్కరు కూడా దొరకలేదా? అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆ పార్టీ సీనియర్ నేత ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ నిలదీశారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తరఫున మహారాష్ట్రలో ఒక్క ముస్లిం నేతకూ టికెట్ ఇవ్వకపోవడంపై ఆరిఫ్ మండిపడ్డారు. ఇదే విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు కావాలి కానీ ముస్లిం అభ్యర్థి మాత్రం వద్దా? అంటూ నిలదీశారు. హైకమాండ్ తీరుకు నిరసనగా పార్టీ ప్రచార బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయబోనని ఆరిఫ్ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర మాజీ మంత్రి ముహమ్మద్ ఆరిఫ్ ఈ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ టికెట్ ఆశించినట్లు సమాచారం. ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న ఆరిఫ్ ను పార్టీ పరిగణనలోకి తీసుకోకుండా ముంబై నార్త్ సెంట్రల్ టికెట్ ను వర్షా గైక్వాడ్ కు కేటాయించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆరిఫ్.. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేపట్టలేనని తేల్చి చెప్పారు. పార్టీలో అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం కల్పించాలనే సిద్ధాంతానికి కాంగ్రెస్ దూరమవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ లో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయంపై ఎదురవుతున్న ప్రశ్నలకు బదులివ్వలేకపోతున్నట్లు ఆరిఫ్ చెప్పారు.

More Telugu News