Yuvraj Singh: టీ20 వరల్డ్ కప్‌‌కు భారత జట్టు కూర్పుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర విశ్లేషణ

Yuvraj Singh analysis on team India selection for the T20 World Cup

  • వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లు ఉత్తమ ఎంపిక అని వ్యాఖ్య
  • దినేశ్ కార్తీక్ బాగానే ఆడుతున్నా.. లెఫ్ట్ హ్యాండర్‌గా పంత్‌కే తుది జట్టులో చోటు ఉంటుందన్న యువీ
  • తుది జట్టులో ఆడించనప్పుడు కార్తీక్‌ని ఎంపిక చేయకపోవడమే బెస్ట్ అని సూచన
  • ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ లేదని వ్యాఖ్య

జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 షురూ కాబోతుంది. ఈ మెగా టోర్నీకి ప్రాబబుల్స్ జట్లను ప్రకటించేందుకు మే 1 తుది గడువుగా ఉంది. దీంతో టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు తమతమ అంచనాలు వెలువరిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తన కలల జట్టుని ప్రకటించాడు.

ఐసీసీ వెబ్‌సైట్‌తో యువరాజ్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్ ఆప్షన్‌లుగా ఎంచుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేశ్ కార్తీక్ అద్బుతంగా ఆడుతున్నప్పటికీ లెఫ్ట్ హ్యాండర్‌గా పంత్‌కే తుది జట్టులో అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని విశ్లేషించాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇదే జరిగిందని గుర్తుచేశాడు. ఆ వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్‌ని ఎంపిక చేసినప్పటికీ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడేందుకు అవకాశం దక్కిందని, తుది జట్టులోకి పరిగణనలోకి తీసుకోలేదని ప్రస్తావించాడు.

దినేశ్ కార్తీక్‌ని తుది జట్టులోకి తీసుకోనప్పుడు ఎంపిక చేయడంలో ఎలాంటి ప్రయోజనంలేదని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. దినేశ్ కార్తీక్ బదులు ఎవరైనా యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని, తద్వారా జట్టులో వైవిధ్యం ఉండేలా చూసుకోవచ్చని మాజీ ఆల్‌రౌండర్ సూచించాడు.

కాబట్టి దినేశ్ కార్తీక్ విషయంలో ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అన్నాడు. ఇక ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, జితేష్‌ శర్మ వంటి ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోకపోవచ్చని యువీ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్‌ బ్రాండ్ అంబాసిడర్‌లలో యువరాజ్ సింగ్ ఒకడిగా ఉన్నాడు. 2007లో టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News