Komatireddy Raj Gopal Reddy: డైరెక్ట్‌గా చెబుతున్నా... వాళ్లను జైలుకు పంపిస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy warns brs leaders

  • తనకు ఎక్కడ మంత్రి పదవి వస్తుందోనని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్న ఎమ్మెల్యే
  • బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శ
  • కేసీఆర్ కుటుంబం, జగదీశ్ రెడ్డి జైలుకు పోక తప్పదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి రావొద్దని బీఆర్ఎస్ నాయకులు దేవుడికి మొక్కుకోవాలని... ఎందుకంటే నాకు కనుక మంత్రి పదవి వస్తే మీరంతా జైలుకు వెళతారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. నేను డైరెక్ట్‌గా చెబుతున్నానని... నేను ఊరుకునే మనిషిని కాదన్నారు. అసలు తనకు ఎక్కడ మంత్రి పదవి వస్తుందోనని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారన్నారు. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. మా పార్టీ అధిష్ఠానం చామల కిరణ్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చిందని... కానీ దమ్ముంటే నేను రావాలని బూర నర్సయ్య అనడం విడ్డూరమన్నారు.

బూర నర్సయ్యకు మతిభ్రమించింది కాంగ్రెస్ వల్లనా? లేక ఎండవల్లనా? అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే నేరుగా నన్ను రమ్మని అనడం ఏమిటి... దమ్ముంది కాబట్టే నేను కేసీఆర్‌ను గద్దె దింపానని... కవితను జైలుకు పంపించామన్నారు. మా పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చిన వ్యక్తి గెలుపు కోసం తాను కృషి చేస్తానన్నారు. బూర నర్సయ్య గౌడ్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని... అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. బూర నర్సయ్య ఓ మంచి డాక్టర్ అని... ఆయన అంటే గౌరవం ఉందని... కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని హెచ్చరించారు. కోమటిరెడ్డి సోదరులు ప్రజల కోసం త్యాగాలు చేశారన్నారు.

కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకు పోక తప్పదన్నారు. వారితో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి కూడా జైలుకు వెళతాడని జోస్యం చెప్పారు. ఆయన వద్ద వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. వీటన్నింటిని ఎలా సంపాదించాడో వెలికి తీస్తామన్నారు. నాగారంలో బంగ్లాతో పాటు భూములను ఎలా సంపాదించాడు? హైదరాబాద్‌లో బినామీ పేర్లపై ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అన్నీ బయటకు తీస్తామన్నారు. వీటిపై తొందర అవసరం లేదన్నారు. ఏమైనా అంటే బీఆర్ఎస్ నేతలు తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News