Puri Jagannadh: అలా ఉంటేనే ‘భూమిపై శాంతి’: దర్శకుడు పూరీ జగన్నాథ్
- భూమ్మీద యుద్ధాలు ఆపాలంటే ప్రేమగా ఉండటమే మార్గం
- ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైన గొడవ ప్రపంచ యుద్ధం దాకా వెళ్లొచ్చు
- దేనికైనా ప్రారంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టాలన్న దర్శకుడు
ఎప్పుడూ కూడా పక్కవారిని ప్రేమతో పలకరించాలని.. అది ‘భూమిపై శాంతి’కి మార్గం చూపుతుందని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని చెప్పారు. ‘పూరి మ్యూజింగ్స్’లో భాగంగా తాజాగా ‘భూమిపై శాంతి’ పేరిట ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
సంఘర్షణలోనే మనిషి జీవితం
ప్రతి మనిషి కూడా ఎప్పుడూ సంఘర్షణలోనే జీవిస్తున్నాడని.. పక్కింటి వాళ్లతో, కుటుంబంతో, సమాజంతో.. ఆఖరికి తనతో తానే ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడని పూరీ జగన్నాథ్ చెప్పారు. మళ్లీ తానే తన కుటుంబం, తన భాష, దేశం కోసం యుద్ధాలు చేస్తాడని పేర్కొన్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయుధాల ఉత్పత్తిని, అణు బాంబులు తయారుచేయడం నిలిపివేయాలని 1965లోనే ఒక మతపెద్ద కోరారని.. అప్పట్లో ఆ స్పీచ్ బాగా వైరల్ అయిందని పూరీ గుర్తు చేశారు. మతాలేవైనా ఎన్నో వేల ఏళ్ల నుంచి కూడా శాంతి గురించే మాట్లాడాయని.. కానీ ఇప్పటివరకు జరిగిన ప్రతీ యుద్ధం మతాల వల్లే జరిగిందని.. అలా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని అన్నారు.
చిన్న గొడవలను ఆపితేనే..
దేశాల మధ్య, గ్రూపుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయని... యుద్ధం లేకుండా మనకు శాంతి లేదన్నట్టుగా మారిందని పూరీ చెప్పారు. అసలు యుద్ధాలను ఆపాలంటే ముందు మనమధ్య జరిగే చిన్న చిన్న గొడవలను ఆపేయాలన్నారు. ‘‘ఒకరిని ఒకరు అసహ్యించుకోవడం తగ్గించాలి. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వల్ల ఒక తరం విడిపోవచ్చు. తర్వాత ఆ ఊరు రెండు ముక్కలవొచ్చు. అది అలా పెరిగీ పెరిగీ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చు. ఒక చిన్న తగాదా కూడా వైరస్ లా వ్యాపించి వెయ్యేళ్లు కొనసాగుతుంది. అందుకే దేనికైనా ప్రారంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి.” అని పూరీ పేర్కొన్నారు.
మతాలను గౌరవించాలి..
మన మతాన్ని ప్రేమించడంతో పాటు ఎదుటి వారి మతాన్ని గౌరవించాలని పూరీ చెప్పారు. పక్కవారితో ఏమాత్రం పరుషంగా మాట్లాడినా.. ఏదో ఒకరోజు గొడవగా మారుతుందన్నారు. అణు బాంబులు తయారు చేయడం వల్లో, ఆపేయడం వల్లో యుద్ధాలు రావడం, ఆగడం ఉండదన్నారు. అణు బాంబుల వంటి ఆలోచనల వల్లే అన్ని సమస్యలు వస్తాయన్నారు. అంతా ప్రశాంతంగా ఉండాలని.. ఎదుటివారిని ప్రశాంతంగా ఉండనివ్వాలని కోరారు.