mount fuji: మౌంట్ ఫ్యూజీ సందర్శకులకు జపాన్ ఝలక్!
- వ్యూ పాయింట్ నుంచి పర్వతం కనిపించకుండా భారీ నల్ల తెర ఏర్పాటు చేయనున్న అధికారులు
- ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తుండటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకే..
- జపాన్ కు పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు.. గత నెల 30 లక్షల మంది సందర్శన
ప్రముఖ టూరిస్ట్ స్పాట్ మౌంట్ ఫ్యూజీ అగ్నిపర్వతాన్ని సందర్శించే విదేశీ టూరిస్టులు నిబంధనలను అతిక్రమిస్తుండటంతో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్వత ప్రాంతంలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తుండటం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో పర్యాటకులను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఆ పర్వతం కనిపించకుండా 8 అడుగుల ఎత్తు, 65 అడుగుల పొడవుతో భారీ మెష్ నెట్ ను నల్ల తెరలాగా అడ్డుగా ఏర్పాటు చేయనుంది. వచ్చే వారమే దీని ఏర్పాటు మొదలవుతుందని ఓ అధికారి తెలిపారు.
నిబంధనలను కొందరు పర్యాటకులు గౌరవించకపోవడం వల్లే తాము ఈ పని చేయాల్సి వస్తోందని ఆయన ఏఎఫ్ పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. రాజధాని టోక్యోకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఫ్యూజీకావాగుచికో నగరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఈ నగరం నలువైపుల నుంచి చూసినా అగ్నిపర్వతం కనిపిస్తుంది. అయితే అక్కడున్న ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ దగ్గర ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ బాగా పాప్యులర్ అయింది.
సోషల్ మీడియాలో ఇక్కడి ఫొటోలే ఎక్కువగా పోస్ట్ అవుతుండటంతో వ్యూ పాయింట్ వద్దకే ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు. కానీ ఎక్కడంటే అక్కడ వాహనాలను నిలుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో ఈ చర్య చేపట్టనుంది. అయితే పరిస్థితి మెరుగుపడే దాకానే ఈ తెరను ఉంచుతామని అధికారులు చెప్పారు.
జపాన్ లో ఇప్పటికే లెక్కకు మించి విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 30 లక్షల మంది విదేశీ పర్యాటకులు జపాన్ కు క్యూ కట్టారు. దీంతో క్యోటో గీషీ జిల్లాకు చెందిన ప్రజలు తమ ఇళ్ల సందుల్లోకి పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు.