indian origin: అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న భారత సంతతి మహిళ అరెస్ట్
- ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న అచింత్య శివలింగన్
- మరో విద్యార్థితోపాటు ఆమెను కూడా క్యాంపస్ నుంచి బహిష్కరించిన వర్సిటీ
- అరెస్టులను ఖండించిన విద్యార్థులు
అమెరికాలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నందుకు భారత సంతతికి చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో నిరసనల కోసం టెంట్లు వేసినందుకు హసన్ సయెద్ అనే విద్యార్థితోపాటు తమిళనాడుకు చెందిన అచింత్య శివలింగన్ అనే విద్యార్థిని కూడా పోలీసులు అరెస్టు చేశారని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోర్రిల్ తెలిపారు. వర్సిటీ క్యాంపస్ లోకి రాకుండా వారిద్దరినీ నిషేధించారని చెప్పారు. వారిపై క్రమశిక్షణా చర్యల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని వివరించారు.
ప్రిన్స్ టన్ అలూమ్నీ వీక్లీ కథనం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో 110 మంది విద్యార్థులు వర్సిటీ క్యాంపస్ లో టెంట్ వేసుకొని ఉన్నారు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి వారి సంఖ్య 300కు పెరిగింది. నిరసనకారుల్లో ప్రిన్స్ టన్ విద్యార్థులతోపాటు ఫ్యాకల్టీ సభ్యులు, స్థానికులు, వర్సిటీతో సంబంధంలేని విద్యార్థులు కూడా ఉన్నారు. వర్సిటీ అధికారుల హెచ్చరికలను పట్టించుకోనందుకు ఇద్దరు ప్రిన్స్ టన్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని వర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోర్రిల్ చెప్పారు. ఆ తర్వాత మిగిలిన విద్యార్థులు ధర్నా కొనసాగించారన్నారు.
అయితే ఈ అరెస్టులను వర్సిటీలోని ఇతర విద్యార్థులు ఖండించారు. ఈ అరెస్టులను “హింసాత్మకం”గా ఉర్వీ అనే ఫస్టియర్ పీహెచ్ డీ విద్యార్థి అభివర్ణించింది. ఆ విద్యార్థుల చేతులకు పోలీసులు జిప్ టైలను కట్టారని, ఇళ్ల నుంచి ఖాళీ చేయించారని.. వస్తువులు తీసుకొనేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం ఇచ్చారని విమర్శించింది. అయితే విద్యార్థుల అరెస్టులో బలప్రయోగం ఏదీ జరగలేదని, విద్యార్థులు కూడా ప్రతిఘటించలేదని జెన్నిఫర్ తెలిపారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను తప్పుబడుతూ అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కొన్నిరోజులుగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ద్వారా లాభం పొందే కంపెనీల నుంచి ప్రిన్స్ టన్ యూనివర్సిటీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమెరికా రక్షణ శాఖ నిధులతో వర్సిటీ చేపడుతున్న ‘యుద్ధ ఆయుధాల’పై పరిశోధనను తక్షణమే నిలిపేయాలని పట్టుబడుతున్నారు. ఇజ్రాయల్ కు చెందిన విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. అన్నింటికీ మించి ఇజ్రాయెల్ వెంటనే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిస్తున్నారు.
టెక్సాస్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన విద్యార్థులను పదుల సంఖ్యలో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాస్ ఏంజిలెస్ లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా క్యాంపస్ లో పోలీసులతో విద్యార్థులు ఘర్షణకు దిగారు. అలాగే బోస్టన్ లోని ఎమర్ సన్ కాలేజీలో 108 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కొలంబియా యూనివర్సిటీలో గత వారం 100 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు ఈ వారం న్యూయార్క్ యూనివర్సిటీలో 133 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే యేల్ యూనివర్సిటీ నుంచి 40 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.