indian origin: భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు

IndianOrigin Man Wanted For Assault Shot Dead By US Police
  • ఓ మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో నిందితుడిగా సచిన్ సాహు
  • అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా దాడి
  • తుపాకీతో కాల్పులు జరిపిన పోలీసులు.. అక్కడికక్కడే నిందితుడి మృతి
అమెరికాలోని శాన్ అంటోనియోలో సచిన్ సాహు అనే 42 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఓ మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన ఇద్దరు అధికారులను సైతం కారుతో ఢీకొట్టడంతో.. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందినవాడని, అయితే అతను అమెరికా పౌరసత్వం పొంది ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ నెల 21న సాయంత్రం శాన్ అంటోనియో పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. చెవియట్ హైట్స్ లోని ఇంటి వద్ద ఓ వ్యక్తి మారణాయుధంతో సంచరిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. అయితే పోలీసులు అక్కడకు వెళ్లేసరికి వాహనంతో ఢీకొట్టడంతో కిందపడి ఉన్న ఓ 51 ఏళ్ల మహిళ కనిపించింది. ఈ కేసులో అనుమానితుడైన సాహు మాత్రం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతనిపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. కొన్ని గంటల తర్వాత అతను తిరిగి దాడి చేసిన ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు చెప్పడంతో పోలీసులు మళ్లీ అక్కడకు చేరుకున్నారు. అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తుండగానే సాహు ఇద్దరు పోలీసు అధికారులను వాహనంతో ఢీకొట్టాడు. దీంతో ఓ పోలీసు అధికారి తన తుపాకీతో సాహుపై కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే మరణించాడు.    

సాహు ఢీకొట్టిన మహిళ అతని రూమ్ మేట్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, బాధితురాలికి సర్జరీలు జరుగుతున్నాయని వివరించారు. అయితే సాహు బైపోలార్ డిజార్డర్ తో గత పదేళ్లుగా బాధపడుతూ ఉండేవాడని అతని మాజీ భార్య లీ గోల్డ్ స్టీన్ చెప్పారు. అలాగే స్క్రిజోఫ్రీనియా అనే మానసిక సమస్యతోనూ బాధపడేవాడని తెలిపింది. ఈ విషయాన్ని కెన్స్5 డాట్ కామ్ అనే వెబ్ సైట్ తెలిపింది. అయితే తమ అధికారుల కథనాన్ని నిర్ధారించేందుకు వారి బాడీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
indian origin
us police
man
shot dead

More Telugu News