Chandrababu: మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్ ను ఓడిస్తాడట... బచ్చా! పవన్ కల్యాణ్ ను నువ్వా ఓడించేది?: చంద్రబాబు
- రైల్వేకోడూరులో కూటమి ఎన్నికల ప్రచార సభ
- హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి
- జగన్ ను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు
- ఇంత చెత్త ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని వెల్లడి
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నిర్వహించిన ఎన్డీయే కూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ ఒక అహంకారి అని, రాష్ట్రాన్ని దోచేసిన ఆ వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐదేళ్ల పాటు పరదాలు కట్టుకుని తిరిగాడని విమర్శించారు. ఇక్కడే ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, నేను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను... ఏనాడైనా మేం పరదాలు కట్టుకుని తిరిగామా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
"ఇప్పుడు పరదాలు తీసేసి వస్తున్నాడు... 24 రోజుల పాటు సిద్ధం అన్నాడు, మళ్లీ మేమంతా సిద్ధం అన్నాడు... నిన్ను ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధం. ఈ రైల్వే కోడూరుకు ఒక్క మంచి పనిచేశాడా, కనీసం కడపకు ఒక్క పని చేశావా? మంచి పనులు చేసుంటే చెప్పుకో. ఇక్కడే అన్నమయ్య డ్యాం ఉంది... కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేని ఈ చెత్త ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట. అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతా అంటే ఎవరైనా నమ్ముతారా?
మూడు రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి జగన్. ఇతను అహంకారి మాత్రమే కాదు ఒక సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి. అందుకే నేను పిలుపునిస్తున్నా... సైకో పోవాలి కూటమి రావాలి. ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఖర్చులు మాత్రం పెరిగాయి. దీనికి కారణం పాలకుడే. నేను చాలా మంది సీఎంలను చూశాను. ఇద్దరం మాజీ ముఖ్యమంత్రులం ఇక్కడే ఉన్నాం. ఇంత చెత్త ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.
కరెంటు చార్జీలు 9 సార్లు పెంచాడు. రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, ఆర్టీసీ చార్జీలు పెంచారు, మద్యం ధరలు పెంచారు. ఈ ప్రభుత్వంలో అమ్ముతున్న మద్యం తాగి మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, కూటమి అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం ఇవ్వండి... ఈ జలగ మమ్మల్ని దోచేస్తున్నాడు... మమ్మల్ని ఆదుకోండి అని ఓ తమ్ముడు ప్లకార్డు పెట్టి చెబుతున్నాడు.
ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడది రూ.200! ఆ రూ.140 జగన్ జేబులోకి పోతున్నాయి. బాధ్యతలేని ముఖ్యమంత్రి నాసిరకం మద్యంతో ఆడబిడ్డల పుస్తెలు తెంపేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జలగ. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆయన మంత్రి, ఆయన తమ్ముడొక ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఒక ఎంపీ. వీళ్లు ఏం ఒరగబెట్టారు? ఎంపీ ఏమైనా పనిచేశాడా? ఒక్కటి మాత్రం జరిగింది. బెరైటీస్ గనులను దోచేసి వేల కోట్లు కొల్లగొట్టారు.
నేను ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎర్రచందనం దొంగలను కట్టడి చేశాం. కానీ ఈ దుర్మార్గులు వచ్చాక స్మగ్లర్లను ప్రోత్సహించారు. ఇక్కడి ఎమ్మెల్యే కూడా ఆ స్మగర్లలో ఒక భాగం. గనుల్లో, మద్యంలో, ఇసుకలో దోచుకున్న డబ్బుతో ఎన్నికలకు వస్తున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి అరాచకాలు అర్థం కావడంలేదు. నేను కన్నెర్ర చేస్తే పెద్దిరెడ్డి ఇంట్లోంచి బయటికి వచ్చేవాడా?
ఆవులాపల్లి రిజర్వాయర్ పేరిట రూ.600 కోట్ల పని చేయకుండా దోచేసిన వ్యక్తి ఈ పెద్దిరెడ్డి. ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా వేసినా, సిగ్గులేని ఈ ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రజధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు ప్రభుత్వానిది, శిక్ష ప్రజలకా? హంద్రీనీవా, గాలేరు-నగరి పనులు జరిగాయా? నీళ్లు వచ్చాయా? ఇక్కడ నీళ్లు తీసుకురాకుండా, హంద్రీనీవాకు సమాంతరంగా గండికోట నుంచి ప్రాజెక్టు మంజూరు చేసి పెద్దిరెడ్డి రూ.1500 కోట్లు కొట్టేశాడు. ఇవన్నీ మేం చెప్పాం, పోరాడాం... దాంతో అంగళ్లులో నాపైనా, 600 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు.
పెద్దిరెడ్డీ నీ పనైపోయింది. నీ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారు. నీ దగ్గర డబ్బులు ఉంటే మా దగ్గర ప్రజాబలం ఉంది. ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్ ను ఓడిస్తాడట... బచ్చా! పవన్ కల్యాణ్ ను నువ్వా ఓడించేది? నిన్ను ప్రజలు ఇక్కడే పూడ్చిపెడతారు.
ఇంకోపక్క, పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి వెళ్లి నన్ను ఓడిస్తాడట. నడమంత్రపు సిరితో కొవ్కెక్కి కొట్టుకుంటున్నారు. జనసైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు, బీజేపీ సైనికులు నిన్ను, నీ కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
జగన్ ప్రతి ఎన్నికలకు ఏదో ఒక కొత్త విషయంతో వస్తాడు. 2014లో తండ్రి లేనివాడ్నంటూ వచ్చాడు. ఏదో రకంగా సానుభూతి పొందాలనేది అతడి ప్రయత్నం. ఇక్కడే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడాయన బీజేపీలో, నేను టీడీపీలో ఉన్నా. మేమిద్దరం కలిసి పాల్గొంటున్న రెండో సభ ఇది. గతంలో మేం సిద్ధాంతాల పరంగా విభేదించుకుని ఉండొచ్చేమో కానీ, వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించుకోలేదు.
ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. కానీ, జగన్ మోహన్ రెడ్డి సోనియాగాంధీ వెనుక దాక్కొని సమైక్యాంధ్ర పేరుతో నాటకాలు ఆడాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడా? ఎప్పుడైనా కనబడ్డాడా? నీ తండ్రి కూడా నీ గురించి భయపడ్డాడు. ఏదో తప్పు చేసి చెడ్డపేరు తెస్తాడని బెంగళూరు పంపించారు.
2009లో తండ్రి చనిపోతే సంతకాలు సేకరించిన సైకో ఈ ముఖ్యమంత్రి. బాబాయ్ ని చంపినవాళ్లను పక్కనబెట్టుకుని దేవుడికే తెలుసు అంటున్నాడు. సాక్షి పేపర్ లో ఏం చెప్పావు... మొదట గుండెపోటు అని చెప్పావా లేదా, ఆ తర్వాత నారాసుర రక్తచరిత్ర అన్నాడు. ఇవాళ మీ ఇంట్లో గొడవలు మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా?" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.