Chandrababu: రాజంపేట సభలో ఆసక్తికర దృశ్యం... ఒకప్పటి ప్రత్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కోసం చంద్రబాబు ప్రచారం

Chandrababu campaigns for Kiran Kumar Reddy in Rajampet

  • ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రజాగళం సభ
  • తాను, కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నామన్న చంద్రబాబు 
  • ఇన్నాళ్లకు తామిద్దరి కాంబినేషన్ కుదిరిందని చమత్కారం
  • కిరణ్ కుమార్ అనుభవజ్ఞుడైన నేత అని కితాబు

అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర దృశ్యం కనువిందు చేసింది. 

ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజంపేట విచ్చేశారు. కిరణ్ కుమార్ కు మద్దతుగా రాజంపేటలో ఏర్పాటు చేసిన కూటమి ప్రచార సభలో చంద్రబాబు పాల్గొని, ప్రసంగించారు. 

కిరణ్ కుమార్ రెడ్డి... వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు మధ్య అసెంబ్లీలో పలుమార్లు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు జరిగాయి. వైఎస్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలోనూ కిరణ్ కుమార్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేదానికి నిదర్శనంగా, ఇవాళ అదే కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని పేర్కొన్నారు. తామిద్దరం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇన్నాళ్లకు రాజంపేట ద్వారా తమ కాంబినేషన్ కుదిరిందని చంద్రబాబు చమత్కరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

ఇక చంద్రబాబు తన ప్రసంగంలో యథావిధిగా సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలని అన్నారు. సీఎం జగన్ కు ఎన్నికలప్పుడు ఏదో ఒక డ్రామా ఆడడం అలవాటని, గత ఎన్నికల సమయంలో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పొందే ప్రయత్నం చేశాడని, కోడికత్తి డ్రామా కూడా ఆడాడని ఆరోపించారు. 

ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని ఎద్దేవా చేశారు. ఆ గులకరాయిని మేమే వేయించామని అంటున్నాడని, ఆ గాయం రోజు రోజుకు పెద్దది అవుతోందని, మానడం లేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

జగన్ గాయానికి ప్రజలే ట్రీట్ మెంట్ ఇవ్వాలని అన్నారు. రేపు 13వ తేదీన జరిగే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించడమే ఆ ట్రీట్ మెంట్ అని స్పష్టం చేశారు. రాజంపేటకు జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజి ఏర్పాటవుతుందని చంద్రబాబు వెల్లడించారు.

More Telugu News