Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ కీలక వ్యాఖ్యలు
- నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే నేతలకు నోటీసులు ఇస్తామని వెల్లడి
- అవసరమైతే కేసీఆర్‌ను పిలిచి ఈ ప్రాజక్టుపై కావాల్సిన సమాచారం సేకరిస్తామని స్పష్టీకరణ
- నివేదికల ఆధారంగా, టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారిస్తామన్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే సంబంధిత రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇస్తామని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ అన్నారు. అవసరమైతే కేసీఆర్‌ను పిలిచి ఈ ప్రాజెక్టుపై తమకు కావాల్సిన సమాచారం సేకరిస్తామన్నారు.
ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ఆ తర్వాత దీనిపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని విచారణ జరుపుతామన్నారు.
ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇంజినీర్లు, ఎన్డీఎస్ఏ అథారిటీతోనూ సమావేశం అవుతామన్నారు. టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారిస్తామన్నారు. బ్యారేజీతో సంబంధం ఉన్న అందరితో కలుస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లి పరిశీలిస్తామన్నారు. నివేదికల ఆధారంగా విచారణ కొనసాగుతుందన్నారు.