Zimbabwe Cricketer: చిరుత దాడి.. మృత్యువు నుంచి తప్పించుకున్న జింబాబ్వే మాజీ క్రికెటర్
- ట్రెక్కింగ్ చేస్తున్న విటల్ పై చిరుత దాడి
- చిరుతపై తిరగబడ్డ విటల్ పెంపుడు శునకం
- రక్తమోడుతున్నా లెక్కచేయక యజమానిని కాపాడిన వైనం
జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్ కు ఆయుష్షు గట్టిగా ఉందనే చెప్పుకోవాలి. తనపై చిరుత దాడి చేసినా, మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో విటల్ పై చిరుత దాడి చేసింది. ఆ దాడి నుంచి విటల్ తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గాయాలతో ఉన్న విటల్ ఫొటోను షేర్ చేసింది. చిరుత దాడి చేసిన వెంటనే ఆయనను బఫెలో రేంజ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి, హరారేలోని మిల్టన్ పార్క్ హాస్పిటల్ కు తరలించారని తెలిపింది. చిరుత దాడిలో చాలా రక్తం పోయిందని, ఆయనకు సర్జరీ చేశారని హన్నా చెప్పింది.
గయ్ విటల్ జింబాబ్వేలో సఫారీ నిర్వహిస్తున్నాడు. హ్యూమని ప్రాంతంలో ఈరోజు ట్రెక్కింగ్ కు వెళ్లాడు. తనతో పాటు తన పెంపుడు శునకాన్ని కూడా తీసుకెళ్లాడు. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అతనిపై ఓ చిరుత దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన పెంపుడు శునకం తన యజమానిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో అది కూడా తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్నా లెక్కచేయక... విటల్ ను రక్షించింది. గాయపడ్డ ఇద్దరినీ ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. విటల్ పెంపుడు శునకం కూడా కోలుకుంటోంది.