Tamilnadu: పిల్లల నవ్వుల వీడియో కోసం స్కూల్ టీచర్ వెరైటీ ప్రయత్నం
- నెటిజన్లను ఆకట్టుకుంటున్న టీచర్ చర్య
- ఆమె చిత్తశుద్ధికి నిదర్శనమని నెటిజన్ల కామెంట్లు
- వీడియోకు ఏకంగా 19.4 మిలియన్ వ్యూస్
తమిళనాడులోని ఓ మోంటిస్సొరీ స్కూల్ టీచర్ చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. క్లాస్ లోని చిట్టిపొట్టి విద్యార్థుల నవ్వులను క్లిక్ మనిపించేందుకు టీచర్ చేసిన ప్రయత్నం అందరి మనసులను గెలుచుకుంటోంది. ఇది ఆమె చిత్తశుద్ధికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకీ ఆ టీచర్ ఏం చేసిందంటే.. తన క్లాస్ పిల్లల నవ్వులను వీడియో తీయాలనుకుంది. ఇందుకోసం మామూలుగా ఎవరైనా పిల్లలను కెమెరా వైపు చూస్తూ నవ్వమని అడుగుతారు. కానీ ఆ టీచర్ మాత్రం వారి నవ్వులోని సహజత్వాన్ని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. చేతిలో ఫోన్ పట్టుకొని నేలపై పడుకొని పిల్లల నవ్వులను చిత్రీకరించింది.
కేవలం అందమైన నవ్వుల కోసమే అనే క్యాప్షన్ తో ఈ వీడియో మొదలవుతుంది. ఒక హాల్లోని మెట్లపై కొందరు చిట్టిపొట్టి విద్యార్థులు, టీచర్లు కూర్చొని ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత టీచర్ కిందపడుకొని వీడియో తీస్తుండటంతో పిల్లలంతా ఆనందం పట్టలేక పగలబడి నవ్వడం అందులో కనిపిస్తుంది. సుమారు రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోకు ఏకంగా 19.4 మిలియన్ వ్యూస్ లభించాయి.