virginia state: వర్జీనియాలో రెండు జింకలకు ‘జాంబీ డీర్’ వ్యాధి

Zombie Deer Disease Hits Another US State As 2 WhiteTailed Deers Test Positive In Virginia

  • హార్పర్స్ ఫెర్రీ నేషనల్ పార్కులో రెండు తెల్ల తోక జింకలకు పాజిటివ్
  • సంతతి నియంత్రణ చర్యల్లో భాగంగా వాటిని వేటాడిన అధికారులు
  • మరో రెండు పార్కుల సమీపంలోని జింకలకూ సోకిన వ్యాధి

పశ్చిమ వర్జీనియాలోని ఫెర్రీ నేషనల్ హిస్టారికల్ పార్కులో రెండు తెల్ల తోక జింకలు ప్రాణాంతక నరాల వ్యాధి క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్ బారినపడ్డాయి. దీన్నే జాంబీ డీర్ డిసీజ్ గా పిలుస్తున్నారు. ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో వాటికి వ్యాధి సోకినట్లు పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. పార్కులో స్థానిక జాతుల మొక్కల పునరుద్ధరణ, పార్కులోని చారిత్రక ప్రదేశాల పరిరక్షణ చర్యల్లో భాగంగా చేపట్టే జంతు సంతతి నియంత్రణ కింద ఆ జింకలను వేటాడారు. ఈ మేరకు నేషనల్ పార్క్ సర్వీస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

నేషనల్ పార్క్ సర్వీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆంటియమ్, మొనోకసీ బ్యాటిల్ ఫీల్డ్ పార్కుల సమీపంలో ఉండే జింకలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వివిధ పార్కుల్లో ఉన్న జింకలకు నెగిటివ్ ఫలితాలే వచ్చాయని, పాజిటివ్ గా తేలడం ఇదే తొలిసారి అని వివరించింది. పార్కుల్లో జింకల సంతతి భారీగా పెరగకుండా నియంత్రించేందుకు తరచూ కొన్ని జింకలను వేటాడతామని తెలిపింది.

ఏమిటీ జాంబీ డీర్ వ్యాధి?
ఈ వ్యాధి బారినపడిన జింకలు గందరగోళానికి గురవుతాయి. వాటి నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. జింక శరీరంలోని ప్రొటీన్లు సరైన ఆకారంలోకి ముడుచుకోకపోవడం వల్ల ప్రియాన్ అనే వ్యాధికి దారితీస్తాయి. అలా సరిగ్గా ముడుచుకోని ప్రొటీన్లు కేంద్ర నాడీ వ్యవస్థ వరకు ప్రయాణించి మెదడు కణజాలం, ఇతర అవయవాల్లో ప్రయాన్ నిల్వలుగా మారతాయి. దీనివల్ల జింకలు బరువుతగ్గడం, నడవలేకపోవడం, చొంగకార్చడం, నిస్సత్తవుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

మెదడు నుంచి అందే సంకేతాలు ప్రభావితం కావడం వల్ల మనుషులను చూసినా ఏమాత్రం భయంలేనట్లుగా కళ్లప్పగించి చూస్తుండిపోతాయి. అందుకే ఈ వ్యాధికి జాంబీ డీర్ డిసీజ్ అని పేరు పెట్టారు. అయితే జింకల్లో ఈ లక్షణాలు బయటపడటానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.  ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు. అయితే మనుషులు ఈ వ్యాధిబారిన పడినట్లు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ ఈ వ్యాధి బారిన పడిన జంతువుల మాంసం తినే కొన్ని రకాల కోతులకు జాంబీ డీర్ డిసీజ్ ముప్పు ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

  • Loading...

More Telugu News