Jagan: వీళ్లా వైఎస్సార్ వారసులు?: షర్మిల, సునీతపై జగన్ ఫైర్

Jagan fires on Sharmila and Sunitha

  • వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న జగన్
  • వారి కుట్రలో తన చెల్లెమ్మలు భాగమయ్యారని విమర్శ
  • అవినాశ్ రెడ్డి ఏ తప్పూ చేయలేదన్న జగన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లపై లేనిపోని ముద్ర వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్), వదినమ్మ (పురందేశ్వరి) ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. వీరి కుట్రలో భాగంగా వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకొస్తున్నారని... ఆ మహానేతకు వారసులు ఎవరో ప్రజలే చెప్పాలని అన్నారు. పులివెందులలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఛార్జ్ షీట్ లో వైఎస్ పేరును చేర్చింది ఎవరు? అని జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్ కీర్తి, ప్రతిష్టలను చెరిపివేయాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన విగ్రహాలను తొలగిస్తామని చెపుతున్నారని... అలాంటి వాళ్లతో చేయి కలిపిన వాళ్లా వైఎస్సార్ వారసులు? అని షర్మిల, సునీతలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, బీజేపీల కుట్రలో తన చెల్లెమ్మలు భాగమయ్యారని విమర్శించారు. 

చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో ఆ దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసని జగన్ అన్నారు. వివేకాను చంపిన వ్యక్తికి మద్దతు ఇస్తున్నది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. పలు ఇంటర్వ్యూలలో అవినాశ్ లేవనెత్తుతున్న ప్రశ్నలు కరెక్టేనని అన్నారు. అవినాశ్ తప్పు చేయలేదని... తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పారు. అవినాశ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని... పసుపు మూకల కుట్రలో మన చెల్లెమ్మలు భాగస్వాములయ్యారని అన్నారు. రాజకీయ స్వార్థంతో ఈ కుట్రలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

పులివెందుల తన సొంత గడ్డ, తన ప్రాణానికి ప్రాణమని జగన్ చెప్పారు. పులివెందుల అంటే ఒక నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ అని అన్నారు. పులివెందులలో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏంలేదు అనే స్థాయికి చేరుకున్నామని అన్నారు. కడప కల్చర్, పులివెందుల కల్చర్, రాయలసీమ కల్చర్ అని మనవైపు వేలెత్తి చూపిస్తున్నారని... మంచి మనసు కలిగి ఉండటం, బెదిరింపులకు లొంగకపోవడమే మన కల్చర్ అని చెప్పారు. టీడీపీ మాఫియాను నాలుగు దశాబ్దాల పాటు ఎదిరించింది పులివెందుల బిడ్డేనని అన్నారు.

Jagan
YS Avinash Reddy
YSRCP
YS Sharmila
YS Sunitha Reddy
Congress
YS Vivekananda Reddy
AP Politics
  • Loading...

More Telugu News