Reliance Jio: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో అరుదైన రికార్డు.. చైనా మొబైల్ రికార్డు బద్దలు
- 2024 తొలి త్రైమాసికంలో 40.9 ఎగ్జాబైట్స్ జియో డేటా వినియోగం
- అదే సమయంలో చైనా మొబైల్ డేటా వినియోగం 38 ఎగ్జాబైట్స్ మాత్రమే
- 108 మిలియన్ మంది 5జీ యూజర్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సబ్‌స్క్రైబర్ బేస్
టెలికం రంగంలోకి అడుగుపెట్టీ పెట్టడంతోనే సంచలనం సృష్టించి దేశంలోని అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా అవతరించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా అవతరించింది. మొబైల్ డేటా ట్రాఫిక్ విషయంలో చైనా మొబైల్‌ను దాటేసింది.
2024 తొలి త్రైమాసికంలో చైనా మొబైల్ 38 ఎగ్జాబైట్స్ ట్రాఫిక్ నమోదు చేయగా, అదే సమయంలో 40.9 ఎగ్జాబైట్స్ జియో డేటా వినియోగమైనట్టు గ్లోబల్ అనలటిక్స్ సంస్థ టెఫిసియెంట్ పేర్కొంది. అలాగే, జియో ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. 108 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లతో జియో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5 సబ్‌స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న రికార్డును సొంతం చేసుకుంది.
జియో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో ఇప్పుడు 28 శాతం 5జీ యూజర్ల నుంచే నమోదవుతోంది. జియో భారత్ వాల్యూ ప్లాన్లు, అన్‌లిమిటెడ్ 5జీ ఆఫర్లతో కూడి ప్రమోషనల్ ప్యాక్‌ల కారణంగా జియో సబ్‌స్కైబర్లు వేగంగా పెరుగుతున్నారు.