MS Dhoni: మరోసారి ట్రెండింగ్​లోకి 'డీఆర్ఎస్ - ధోనీ రివ్యూ సిస్టం'

Once again Dhoni Review System Trending

  • ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో టాప్ ఫామ్‌లో ధోనీ
  • బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ అదే జోరు
  • చివ‌రికి 'డీఆర్ఎస్' (డెసిష‌న్ రివ్యూ సిస్ట‌మ్) తీసుకోవ‌డంలోనూ మునుప‌టి ధోనీని గుర్తు చేసిన వైనం
  • నిన్న‌టి ల‌క్నోతో మ్యాచులో ధోనీ కోరిన రివ్యూ స‌క్సెస్ 
  • దాంతో మ‌రోసారి ధోనీయే క‌రెక్ట్ అంటూ 'డీఆర్ఎస్ - ధోనీ రివ్యూ సిస్టం' ను ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్‌ 

ఎన్ని బంతులు ఆడారు, ఎన్ని ప‌రుగులు చేశారు, ఎక్క‌డ ఆడుతున్నారు, జ‌ట్టు గెలిచిందా, ఓడిందా.. ఇవ‌న్నీ అన‌వ‌స‌రం. ఆ మ్యాచ్‌లో ధోనీ ఉన్నాడు అంటే చాలు. క్రికెట్ అభిమానుల‌కు పూన‌కం వ‌చ్చేస్తుంది. ధోనీ చ‌రిష్మా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్ప‌టికీ 100 శాతం ఫిట్‌గా లేకున్నా కేవ‌లం త‌న కోసం మైదానంకు వ‌చ్చే అభిమానుల‌ను నిరాశప‌ర‌చ‌కూడ‌ద‌నే కార‌ణంతో ఎంఎస్‌డీ ఆఖ‌రు ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ కు దిగుతున్నాడని ఇటీవ‌ల స్వ‌యంగా సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇక కీపింగ్ విష‌యంలో ఈ జార్ఖండ్ డైన‌మెట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

ఒక‌ప్పుడు హెలికాప్ట‌ర్ షాట్‌తో ఎంత గుర్తింపును పొందాడో.. ఆ త‌ర్వాత డీఆర్ఎస్ (డెసిష‌న్ రివ్యూ సిస్ట‌మ్) విష‌యంలో కూడా అంతే గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఎంత‌లా అంటే.. ధోనీ డెసిష‌న్ రివ్యూ కోరాడంటే అది క‌చ్చితంగా ఔట్ అనే భావించాలి. అంత క‌చ్చితత్వంతో రివ్యూకు వెళ్తాడు ఎంఎస్‌డీ. అందుకే డెసిష‌న్ రివ్యూ సిస్ట‌మ్ కాస్తా ధోనీ రివ్యూ సిస్టంగా మారిపోయింది. ధోనీ ఫీల్డింగ్ లోకి దిగాడంటే ఇక అంతే. అంపైర్ రాంగ్ డెసిషన్ కూడా డీఆర్ఎస్ లో కరెక్ట్ అయిపోతుంది. అంతటి పవర్ ఉంది దానికి. అందుకే ఈ ఎంఎస్‌డీ ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకున్నా కూడా తన టీమ్ మేట్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా అతడి మాటకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఈ రివ్యూ సిస్టమ్ మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే ?
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మంగ‌ళ‌వారం లక్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్ 13వ ఓవ‌ర్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ చేశాడు. అయితే మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ బంతికి ధోనీ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఆ రివ్యూ స‌రైనదే అని తేలింది. దీంతో అంపైర్ వెంటనే తన వైడ్ కాల్‌ను రివ‌ర్స్ చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ ధోనీయే కరెక్ట్ అంటూ హోరెత్తించారు. ఇప్పుడు నెట్టింట మీమ్స్ తో ఈ రివ్యూను ట్రెండ్ కూడా చేస్తున్నారు.

కాగా, ఈ సీజ‌న్‌లో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న ధోనీ ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో క్రీజులోకి వ‌చ్చి బ్యాట్ ఝ‌ళిపిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచుల్లో బ్యాటింగ్‌కి దిగిన మాజీ కెప్టెన్ ఆరు సార్లు నాటౌట్‌గా మిగ‌ల‌డం విశేషం. ఇక ఈ ఎనిమిది మ్యాచుల‌లో ఇన్నింగ్స్ 20వ ఓవ‌ర్‌లో అత‌డు చేసిన 91 ప‌రుగుల‌ను 260 స్ట్రయిక్‌రేట్‌తో సాధించ‌డం గ‌మ‌నార్హం. 
 
ఇదిలాఉంటే.. నిన్న‌టి మ్యాచ్ లో ల‌క్నో అద్భుత విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్ అజేయంగా శ‌త‌కం (124) బాద‌డంతో 211 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కూడా చాలా సులువుగా ఛేదించింది. 211 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.

  • Loading...

More Telugu News