Naveen Patnaik: ఒడిశా రాజకీయాల్లో 'లుంగీ' వార్..!
- సీఎం నవీన్ పట్నాయక్ లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
- ఎన్నికల ప్రచారంలో భాగంగా లుంగీ ధరించి వీడియో విడుదల చేసిన సీఎం నవీన్ పట్నాయక్
- లుంగీ సీఎం.. లుంగీ సీఎం అంటూ బీజేపీ సెటైర్లు
- లుంగీ కట్టుకుంటే తప్పేంటని బీజేడీ ఎదురుదాడి
ఒడిశా రాజకీయాల్లో లుంగీ వార్ నడుస్తోంది. త్వరలో జరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజూ జనతాదల్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పార్టీ గుర్తు అయిన శంఖంను రెండు చేతులలో పట్టుకుని ఓ ఓటు ఎమ్మెల్యేకు, మరో ఓటు ఎంపీకి వేయాలంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన లుంగీ ధరించి కనిపించారు. అంతే.. దీనిపై బీజేపీ లుంగీ సీఎం.. లుంగీ సీఎం అంటూ సెటైర్లు వేస్తోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ నవీన్ బాబు అనే వృద్ధుడు రెండు శంఖాలతో ఓట్లు అడుక్కుంటున్నాడు. వృద్ధుడు అయిన నవీన్ బాబుపై గౌరవం ఉంది. కాకపోతే కుర్తా పైజామా వేసుకునే బాబు.. ఇలా లుంగీలో కనిపించడం చూసి అయినా ఆ పార్టీ నేతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చురకలు అంటించారు.
ఇక్కడే మనకు ఓ అనుమానం వస్తుంది. లుంగీ కట్టుకుంటే ఇబ్బంది ఏంటీ అని. మన దగ్గర ఇలా లుంగీ కట్టుకుని బయటకు రావడం కామన్. కానీ, ఒడిశాలో లుంగీతో బయటకు రారట. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే లుంగీలో ఉంటారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా కుర్తా పైజామా వేసుకుంటారట. కానీ, ఇప్పుడు ఏకంగా ఒడిశా సీఎం లుంగీ ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని బీజేపీ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు లుంగీ కట్టుకుంటే తప్పేంటని బీజేడీ ఎదురుదాడికి దిగింది. బీజేపీకి కౌంటర్‌గా బీజేడీ నేతలు కొందరు లుంగీలు కట్టుకుని ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లో మీరు లుంగీలు కట్టుకోరా అంటూ బీజేపీపై బిజూ జనతాదళ్ ఎదురుదాడి చేస్తోంది.