Rajnath Singh: వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

Union minister Rajnath Singh alleges YSRCP govt corrupted

  • విశాఖలో మేధావుల సదస్సు
  • కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్
  • ఏపీలో ఎన్డీయే కూటమి వస్తేనే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టీకరణ 
  • ఏపీ మేలు కోసం పొత్తులో జూనియర్ పార్టీగా ఉండేందుకు అంగీకరించామని వెల్లడి

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ విశాఖపట్నంలో మేధావుల సదస్సుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అధికార వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తేనే ఈ భూదందాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. 

బీజేపీ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ, ఏపీలో పరిస్థితుల దృష్ట్యా ఒక జూనియర్ పార్టీగా పొత్తులో ఉండేందుకు అంగీకరించామని రాజ్ నాథ్ సింగ్ వివరించారు. వైసీపీ అవినీతిపూరిత, తప్పుడు పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ కు విముక్తి కలిగించేందుకే తాము పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 

ఏపీలో లాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మిల్లర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని వెల్లడించారు. దోచుకున్న డబ్బంతా ఎవరి జేబులోకి పోతోంది? అని ప్రశ్నించారు. త్వరలోనే ఈ దందాలన్నీ బట్టబయలవుతాయి అని అన్నారు. 

"వైసీపీ ప్రభుత్వ ఖజానా ఎప్పుడూ ఖాళీగానే ఉంటోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అప్పు ఎంతో తెలుసా... రూ.13.5 లక్షల కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పన్ను పెంచేసింది. నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరి తలపై రూ.2 లక్షల అప్పు ఉంది. సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరం ఇవాళ అంతర్జాతీయ డ్రగ్స్ పంపిణీకి గమ్యస్థానంగా మారింది... ఇది చాలా దురదృష్టకరం. 

ఇక, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. 

ఏపీలో రూపుదిద్దుకునే విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) రాష్ట్రానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తుంది. 465 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకునే ఈ వీసీఐసీ తూర్పు పశ్చిమ ఆర్థిక కారిడార్ లో ఓ ముఖ్య భాగంగా విలసిల్లుతుంది" అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News