Road Accident: ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!?: వీసీ సజ్జనార్
- ముంబైలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద విజువల్స్ ను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడా లేక పాదచారుల అజాగ్రత్త ప్రమాదానికి కారణమా? అంటూ ప్రశ్న
- ఇద్దరిదీ తప్పేనంటూ స్పందించిన నెటిజన్లు
ప్రముఖ ఐపీఎస్ అధికారి, టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ రోడ్డు భద్రత గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు చేస్తూ, ప్రజలలో అవగాహన కల్పిస్తుంటారు. ముంబైలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాద విజువల్స్ ను ఆయన తాజాగా ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువతులను ఓ కారు అతివేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడం అందులో కనిపించింది. ఈ ఘటనలో యువతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటని నెటిజన్లను సజ్జనార్ ప్రశ్నించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడా? లేక పాదచారుల అజాగ్రత్త కారణమా అని అడిగారు. తన పోస్ట్ కు రోడ్ సేఫ్టీ, ఓవర్ స్పీడ్, రోడ్ యాక్సిడెంట్, రోడ్, డ్రైవ్ సేఫ్, పెడెస్ట్రియన్, డ్రైవ్ స్లో సేవ్ లైఫ్ అనే పదాలను హ్యాష్ ట్యాగ్ లుగా జత చేశారు.
దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను తమ కామెంట్ల రూపంలో పోస్ట్ చేశారు. కొందరు నెటిజన్లు యువతులదే తప్పని పేర్కొనగా మరికొందరు మాత్రం కారు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగిందని అభిప్రాయడపడ్డారు.
కారు డ్రైవర్ రోడ్డుపై దృష్టి పెట్టడంతోపాటు ఇరువైపులను కూడా ఎప్పుడూ గమనిస్తుండాలని.. లేకపోతే ఇలా ప్రమాదాలు జరుగుతాయని కొందరు పేర్కొన్నారు. ఇంకొందరు మాత్రం పాదచారుల్లో ఇటీవలి కాలంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని విమర్శించారు. వాహన డ్రైవర్లే తమను చూసి ఆగుతారులే అనే భావనతో అజాగ్రత్తగా రోడ్డు దాటుతున్నారని మరో యూజర్ కామెంట్ చేశాడు. కీలక ప్రాంతాల్లో రోడ్లు దాటేందుకు వీలుగా పాదచారుల వంతెనలు ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని ఓ యూజర్ సూచించాడు. సజ్జనార్ పెట్టిన పోస్ట్, జత చేసిన వీడియోకు 24 గంటల వ్యవధిలో సుమారు 56 వేల వ్యూస్ వచ్చాయి.