Mukesh Dalal: గుజరాత్ లో సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం
- సూరత్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవం
- కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ... ప్రత్యామ్నాయ అభ్యర్థికి కూడా అదే పరిస్థితి
- నామినేషన్లను ఉపసంహరించుకున్న మరో ఎనిమిది మంది అభ్యర్థులు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీకి ఎంత పట్టు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైంది. సూరత్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
సూరత్ లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించడం, మిగతా ఎనిమిది మంది ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలతో ముఖేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా, గుజరాత్ లో మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. సూరత్ ఎంపీ స్థానంలో బీజేపీ తరఫున ముఖేశ్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేశ్ కుంభానీ బరిలో దిగారు. ఆయనకు సబ్ స్టిట్యూట్ గా సురేశ్ పడ్సాలాను కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంచింది. అయితే వివిధ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు రద్దయ్యాయి. దాంతో, బీజేపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయింది.
ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంపై గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ సోషల్ మీడియాలో స్పందించారు. "సూరత్ స్థానం నుంచి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూరత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి తొలి కమలాన్ని బహూకరిస్తున్నాం. ముఖేశ్ దలాల్ కు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.
సూరత్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకగ్రీవం చోటుచేసుకోవడంపై రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్థీ ఫోన్ ద్వారా స్పందించారు. "విజయవంతంగా నామినేషన్లు దాఖలు చేసిన ఎనిమిది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో దలాల్ ఎలాంటి పోటీ లేకుండా ఎంపీగా ఎన్నికయ్యారు" అని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ సూరత్ ఎంపీ స్థానం నుంచి నీలేశ్ కుంభానీని బరిలో దించింది. అయితే నీలేశ్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదకుల సంతకాల్లో తేడాలు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ ను తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా బరిలో ఉన్న సురేశ్ పడ్సాలాకు కూడా నిరాశ తప్పలేదు. ఆయన నామినేషన్ ను కూడా అధికారులు తిరస్కరించారు.