G Jagadish Reddy: రేవంత్ రెడ్డి సీఎం ప‌ద‌వికి వాళ్ల నేత‌లే ఎస‌రు పెడ‌తారు: జ‌గ‌దీశ్ రెడ్డి

Jagadish Reddy Fire on CM Revanth Reddy

  • త‌న‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రోత‌గా ఉన్నాయ‌న్న బీఆర్ఎస్ నేత‌
  • ఆయ‌న పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అని విమ‌ర్శ‌
  • బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్ర‌స్ అంటూ వ్యాఖ్య‌
  • మోదీ త‌న సీఎం పీఠాన్ని కాపాడుతాడ‌ని రేవంత్ క‌ల‌లు కంటున్నాడంటూ చుర‌క‌లు
  • కోమ‌టిరెడ్డి సోద‌రుల‌ను రేవంత్ పొగుడుతుంటే కాంగ్రెస్ నేత‌లే న‌వ్వుకుంటున్నార‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండిప‌డ్డారు. నిన్న త‌న‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రోత‌గా ఉన్నాయ‌ని తెలిపారు. ఆయ‌న పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అని చెప్పుకొచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని? విమ‌ర్శించారు. 

సీఎం మాటల్లో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌న‌బ‌డింద‌ని పేర్కొన్నారు. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్ర‌స్ అని దుయ్య‌బ‌ట్టారు. ఇక రేవంత్ సీఎం ప‌ద‌వికి వాళ్ల నేత‌లే ఎస‌రు పెడ‌తార‌న్నారు. కాంగ్రెస్ 160 రోజుల పాల‌న‌లో క‌రవు వ‌చ్చింద‌ని, ల‌క్ష‌ల ఎక‌రాల పంట‌లు ఎండిపోయాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

మ‌హిళ‌లు మ‌ళ్లీ బిందె ప‌ట్టుకుని రోడ్డెక్కే ప‌రిస్థితి దాపురించింద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ నుంచి రేవంత్ ప్ర‌ధాని మోదీకి డ‌బ్బు మూట‌లు పంపిస్తున్నాడ‌ని అన్నారు. మోదీ త‌న ముఖ్య‌మంత్రి పీఠాన్ని కాపాడుతాడ‌ని రేవంత్ రెడ్డి క‌ల‌లు కంటున్నాడంటూ చుర‌క‌లంటించారు. కోమ‌టిరెడ్డి సోద‌రుల‌ను రేవంత్ పొగుడుతుంటే కాంగ్రెస్ నేత‌లే న‌వ్వుకుంటున్నార‌ని తెలిపారు. కొండేటి మ‌ల్లయ్య‌, అద్దంకి ద‌యాక‌ర్ లాంటి వాళ్ల‌ను దూరం పెట్టి, ప‌చ్చి బూతులు తిట్టిన కోమ‌టిరెడ్డి సోద‌రుల‌ను వెన‌కేసుకురావ‌డంలో ఆంత‌ర్య‌మేంటి? అని జ‌గ‌దీశ్ రెడ్డి ప్ర‌శ్నించ‌డం జ‌రిగింది.

More Telugu News