Manmohan Singh Speech: మోదీ వ్యాఖ్యలపై దుమారం.. అసలు అప్పట్లో మన్మోహన్ ఏమన్నారంటే?.. వీడియో ఇదిగో!
- 2006 లో అప్పటి పీఎం మన్మోహన్ ప్రసంగం వీడియోను ట్వీట్ చేసిన బీజేపీ
- అప్పట్లోనే మన్మోహన్ సింగ్ పై విమర్శలు.. వివరణ ఇచ్చిన పీఎంవో
- తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన బీజేపీ
రాజస్థాన్ లోని జాలోర్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ప్రధాని మాటలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలూ ఖండించాయి. ఈ నేపథ్యంలో మోదీ ఆరోపణలకు మద్దతుగా బీజేపీ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. 2006 లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన వీడియోను బయట పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రధాని మాటలనే నమ్మడంలేదంటూ విమర్శించింది. దేశ వనరులలో మైనారిటీలకే తొలి హక్కు ఉంటుందని మన్మోహన్ చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, మన్మోహన్ ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అప్పట్లో మన్మోహన్ మాట్లాడిన వీడియోను, పూర్తి ప్రసంగాన్ని కాంగ్రెస్ బయటపెట్టింది.
మన్మోహన్ ఏమన్నారంటే..
‘మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ మేం వినూత్న ప్రణాళికలను తీసుకురాబోతున్నాం. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలి’ అని మన్మోహన్ చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యాలపై 2006లో జాతీయ అభివృద్ధి మండలి ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదం రేగడంతో అప్పట్లోనే ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుడు అర్థం తీస్తున్నారని పేర్కొంది.
మన్మోహన్ పూర్తి ప్రసంగం.. పీఎంవో వివరణ
‘సమ్మిళిత ప్రాధాన్యతలపై మాకు స్పష్టత ఉంది. వ్యవసాయం, నీటిపారుదల, నీటి వనరులు, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో పాటు ఎస్సీ, ఎస్టీలతో పాటు వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. ఎస్సీ, ఎస్టీల కోసం సమగ్ర ప్రణాళికల పునరుద్ధరణ, అభివృద్ధి ఫలాలు అందేలా మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు సాధికారత కల్పించేందుకు వినూత్న ప్రణాళికల అవసరం ఉంది. దేశ వనరులపై ప్రథమ హక్కు వారికే ఉండాలి’ అని మన్మోహన్ చెప్పారు. ఇందులో మన్మోహన్ సింగ్ ఉపయోగించిన ‘వనరులపై తొలి హక్కు’ అనేది ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలతో పాటు ముస్లింలకు అని అర్థమని పీఎంవో నాడు వివరణ ఇచ్చింది.