Postal Ballots: ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది: అశోక్ బాబు

Ashok Babu alleges YCP trying to decrease postal ballots
  • ఉద్యోగ సంఘాలు అప్రమత్తంగా ఉండాలన్న అశోక్ బాబు
  • ఆర్వో, ఏఆర్వోలు ఫారం-12 తీసుకోవడంలేదని ఆరోపణ
  • ఉద్యోగుల నుంచి ఫారం-12 తీసుకునే బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టీకరణ
రాష్ట్రంలో ఉద్యోగుల వ్యతిరేకత నేపథ్యంలో, పోస్టల్ బ్యాలెట్ తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు. ఆర్వో, ఏఆర్వోలు ఆదేశాలు రాలేదని ఉద్యోగుల నుంచి ఫారం-12 తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల నుంచి ఫారం-12 తీసుకునే బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్లు ఎవరో కూడా స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులకు అన్యాయం చేసిన వైసీపీకి బుద్ధి చెప్పాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. 

ఏపీలో లక్షల సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. అందుకే ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తోందని, పోస్టల్ బ్యాలెట్ల తగ్గింపునకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

ఎందుకంటే... ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు... ఒకట్రెండు శాతం మంది ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు తప్ప, మిగతా ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ, పెన్షనర్లు కానీ, కార్మికులు కానీ... వీళ్లందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అశోక్ బాబు వివరించారు. 

వ్యతిరేకత ఉన్నందున పోస్టల్ బ్యాలెట్లు తమకు ప్రతికూలంగా మారతాయని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే కుట్రకు తెరలేపిందని అన్నారు. దీన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఓ సవాల్ గా తీసుకోవాలని అశోక్ బాబు సూచించారు. 

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి తాము విధులు నిర్వర్తిస్తున్న చోట ఫారం-12ను ఆర్వోకు గానీ, ఏఆర్వోకు గానీ ఇచ్చి రసీదు తీసుకోవాల్సిన అవసరం ఉందని అశోక్ బాబు స్పష్టం చేశారు.
Postal Ballots
Ashok Babu
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News