Lopamudra Sinha: మండుతున్న ఎండల గురించి వార్తలు చదువుతూ వడదెబ్బకు గురైన టీవీ యాంకర్
- దేశంలో భానుడి భగభగలు
- పశ్చిమ బెంగాల్ దూరదర్శన్ చానల్లో ఘటన
- అత్యధిక ఉష్ణోగ్రతల గురించి వార్తలు చదువుతూ కళ్లు తిరిగి పడిపోయిన యాంకర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మూడో వారం నాటికే భానుడి ప్రతాపం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, వేసవితాపం తీవ్రతను తెలియజేసే ఓ ఘటన చోటుచేసుకుంది. ఆరు బయట తిరిగే వారికే కాదు, నాలుగ్గదుల మధ్య ఉండేవారు కూడా అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగిందంటే... పశ్చిమ బెంగాల్ దూరదర్శన్ చానల్ లో వాతావరణ వార్తలు చదువుతున్న సమయంలో, యాంకర్ లోపాముద్ర సిన్హా కళ్లు తిరిగి పడిపోయారు. కోల్ కతాలోని దూరదర్శన్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా, అధిక వేడిమి గురించి వార్తలు చదువుతుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. కొంతసేపటి తర్వాత ఆమె తేరుకున్నారు.
ఈ విషయాన్ని లోపాముద్ర సిన్హా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ సమయంలో తన రక్తపోటు ఒక్కసారిగా పడిపోయిందని వివరించారు. మొదట కళ్లు మసకగా కనిపించాయని, క్రమంగా కళ్ల ముందు చీకటి ఆవరించిందని, మాట తడబడిందని తెలిపారు. ఎదురుగా ఉన్న టెలీప్రాంప్టర్ కూడా సరిగా కనిపించలేదని లోపాముద్ర పేర్కొన్నారు. ఓ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత కుదుటపడ్డానని తన ఫేస్ బుక్ వీడియోలో చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైబడి నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పర్బా, పశ్చిమ భర్ధమాన్, పశ్చిమ మేదినిపూర్, పురూలియా, ఝర్ గ్రామ్, భిర్భూమ్, ముర్షీదాబాద్, బంకురా జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి.