Etela Rajender: మోదీకి ఎందుకు ఓటు వేయాలంటే...!: ఈటల రాజేందర్
- నరేంద్ర మోదీ హయాంలో బాంబు పేలుళ్లు లేవన్న ఈటల
- లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడానికి ప్రాణాలు వదిలేయాల్సిన అవసరం లేదన్న ఈటల
- మేం భారతీయులమని చెప్పుకునే స్థాయికి నా భారత్ ఎదిగిందని వ్యాఖ్య
- ప్రపంచంలో బలమైన నాయకుడు అంటే ఇప్పుడు మోదీ గుర్తుకు వస్తున్నారన్న ఈటల
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని తీసుకు వచ్చారని గుర్తు చేసిన బీజేపీ నేత
- నా భారత్ అంటూ మోదీ ఎన్నో చేశారని ఈటల చిట్టా
ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు ఓటు వేయాలో మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వివరించారు. మోదీని మూడోసారి ఎందుకు గెలిపించాలి? పదేళ్లలో ఏం చేశారు? అని ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ప్రశ్నించగా... ఆయన స్పందించారు. మోదీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మోదీ పదేళ్ల పాలనలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు లేవని.. ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవని... రక్తం మరకలు లేవని.. సియాచిన్ మంచుకొండల్లో సైనికుల మృతదేహాలు ఉండటం లేదని, లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడానికి ప్రాణాలు వదిలేయాల్సిన అవసరం లేదన్నారు.
మోదీ హయాంలో 'నా భారత్' ప్రపంచ చిత్రపటంలో చేరిందన్నారు. మోదీకి ఒకప్పుడు వీసాను నిరాకరించిన అమెరికా ఇప్పుడు ఆయన అమెరికా సెనేట్‌లో మాట్లాడితే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టే స్థాయికి 'నా భారత్' ఎదిగిందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మేం భారతీయులమని చెప్పుకునే స్థితికి 'నా భారత్' ఎదిగిందన్నారు. ఈ పదేళ్లలో 'నా భారత్'లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఇలాంటి ఎన్నోకారణాల వల్ల మోదీనే గెలిపించుకోవాల్సి ఉందన్నారు. మెజార్టీ భారతీయుల కల రామమందిరాన్ని నిర్మించారని... అందుకు మోదీకి ఓటేయాలన్నారు.
గతంలో ప్రపంచంలో బలమైన రాజకీయ నాయకుడు అంటే బ్రిటన్ ప్రధాని లేదా అమెరికా అధ్యక్షుడు గుర్తుకు వచ్చేవారన్నారు. కానీ ఇప్పుడు భారత ప్రధాని మోదీ కూడా గుర్తుకు వస్తున్నారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ స్థానానికి పునాది వేసింది మోదీయే అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే దానిని ఆపించి మన పిల్లలను తీసుకువచ్చే స్థాయికి ఎదిగామన్నారు. అంతేకాదు, మోదీగారు ఈ యుద్ధానికి పరిష్కారం చూపండని ఆ దేశాలు మన వద్దకు వచ్చాయని గుర్తు చేశారు. కరోనా సమయంలో తక్కువ సమయంలో వ్యాక్సీన్ ఉత్పత్తి చేసే స్థాయికి 'నా భారత్' ఎదిగిందన్నారు. అందరికీ ఉచిత వ్యాక్సీన్, ఉచిత రేషన్ ఇస్తున్నామన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన ఈటల
ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 2015 నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తాను తెలంగాణ రాష్ట్రానికి లోకల్ నాయకుడినన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలిచేది లేదు... ముదిరాజ్‌లను మంత్రిగా చేసేది లేదని ఎద్దేవా చేశారు.