Harish Rao: అబద్ధాలలో రేవంత్ రెడ్డితో మల్లు భట్టివిక్రమార్క పోటీపడుతున్నారు: హరీశ్ రావు

Congress leaders false promises harish rao tweet

  • కాంగ్రెస్ నేతలు పోటీ పడి మరీ అబద్ధాలు చెబుతున్నారన్న హరీశ్ 
  • ఆరు గ్యారెంటీలు.. నూరు అబద్ధాలతో సమానమని వారి మాటల ద్వారా నిరూపితమైందన్న హరీశ్ రావు
  • రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ తెలియనట్లుగా భట్టి నటిస్తున్నారని ఎద్దేవా
  • ఏరు దాటే దాకా ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని విమర్శ

కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలలో పోటీ పడుతున్నారని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వివిధ సందర్భాలలో మాట్లాడిన వీడియోలను ట్వీట్ చేశారు. వారు పోటీ పడి మరీ అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలు.. నూరు అబద్ధాలతో సమానమని వారి మాటల ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.

'అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గారు పోటీ పడుతున్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత బెట్టారు. వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమే. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదం' అని పేర్కొన్నారు. 

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల తర్వాత మొండి చేయి చూపిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని... వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిన్న నిరుద్యోగ భృతిపై ఎగవేత -నేడు రైతు రుణమాఫీపై దాటవేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అంటూ వారు మాట్లాడిన వీడియోలు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News