Duvvada Vani: నా భర్తపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: టెక్కలి వైసీపీ అభ్యర్థి భార్య

Tekkali YCP MLA candidate Duvvada Srinivas wife Vani to contest in elections as independent

  • టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ప్రకటన
  • స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని కార్యకర్తలతో అన్న వాణి
  • శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి సంచలన ప్రకటన చేశారు. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జడ్పీటీసీ సభ్యురాలైన వాణి తన అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం కావడంతో కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్టు వారితో చెప్పారు. మరోవైపు, దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం.

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైసీపీ నియమించింది. అయితే, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్యనాయకులు ఆమెను నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారని సమాచారం.

More Telugu News