Nominations: నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీసు వద్ద నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత!
- నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో నామినేషన్ల కోలాహలం
- నామినేషన్ సమర్పించిన కోవూరు అసెంబ్లీ స్థానం వైసీపీ, టీడీపీ అభ్యర్థులు
- తాలూకా ఆఫీసు వద్ద ఘర్షణ... ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
ఏపీలో ఇవాళ్టి నుంచి నామినేషన్ల సమర్పణ షురూ అయింది. వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో, నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీసు వద్ద నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కోవూరు అసెంబ్లీ స్థానానికి తొలుత వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇరు పార్టీల వారు దాదాపు ఒకే సమయంలో తాలూకా ఆఫీసు వద్దకు రాగా, ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.
అటు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. రామ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు అని తెలిసిందే. రామ్ కుమార్ రెడ్డి తరఫున ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.